కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత ఆ స్థాయి ఫ్యాన్ బేస్‌ని, క్రేజ్‌ని దక్కించుకుని టాప్ హీరోగా పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో తళపతి విజయ్. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. రీసెంట్‌గా `వారసుడు` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ఈ సారి పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్‌తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `లియో.

ఈ మూవీని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి కల్ట్ సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో `లియో`ని కూడా రూపొందిస్తున్నారు. హీరో విజయ్ గ్యాంగ్ స్టార్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఆయనకు జోడీగా త్రిష కనిపించనుంది. దాదాపు 20 ఏళ్ల విరామం తరువాత వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇది. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
పోస్టర్ చూస్తుంటే ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలకు మించి మరింత వైల్డ్‌గా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది. వెనరక మంచు కొండలు, పక్కనే తోడేలు..ఓ వ్యక్తి ఊడిన పళ్లు..చేతిలో సుత్తితో హీరో విజయ్ వైల్డ్‌గా కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఫస్ట్ షెడ్యూల్‌ని కశ్మీర్‌లో చేశారు. అక్కడే కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తయింది. అందులోని ఓ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన స్టిల్‌ని విడుదల చేశారు. దీంతో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి.