ఖండం దాటినా బోనం
మన బోనాల పండుగ ఖండాంతరాలు దాటింది. సింగపూర్‌లో తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. 500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. భక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో, డప్పు వాయిద్యాలు అలరించాయి.
అమ్మవారి నామస్మరణలతో పరిసరాలు మార్మోగాయి. బోనం ఆ జగన్మాతకు ఆషాడ మాసంలో సమర్పించే నైవేద్యన్నీ సమర్పించారు. మహిళలు బోనాలకు కుండలను వేప కొమ్మలతో, పసుపు, కుంకుమలతో అలంకరించారు. దానిపై దీపం ఉంచారు. తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాల్ని అందరికీ పంచిపెట్టారు.‘పోతురాజు’ వేషధారణ, వారి ఆహార్యం, మనోహరమైన సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఈ బోనాల పండుగకు మరింత ఆకర్షణగా నిలిచింది.
సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పండుగకు హాజరయ్యేందుకు వచ్చిన వారి కోసం ఉచితంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. బోయిన స్వరూప, పెద్ది కవిత, కలకుంట్ల లావణ్య, వేముల సౌహన్య తదితర మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు.

సింగపూర్‌లో నివసించే పలు కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. బోనాలు పండుగ మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయ పండుగ అని, దీన్ని ఏటా జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వేడుకలకు హాజరై బోనాలు సమర్పించిన మహిళలు, పాల్గొన్న వారందరినీ, కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. బోనాలు వేడుక సజావుగా జరిగేందుకు సహకారం అందించిన సభ్యులందరికీ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ ధన్యవాదాలు తెలిపారు.