Team India: 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఇద్దరు ఆటగాళ్లు ఇంకా టీమిండియాకు ఆడుతున్నారు. వారిలో ఒకరు రోహిత్ శర్మ కాగా మరొకరు దినేష్ కార్తీక్. ఈ ఏడాది ఐపీఎల్‌లో విశేషంగా రాణించడంతో వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్‌ను సెలక్టర్లు ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. అయితే టీమిండియా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడినా దినేష్ కార్తీక్ పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. దీంతో అతడిని తప్పించి రిషబ్ పంత్‌ను తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లలో పర్యటించనుంది. ఈ రెండు పర్యటనలకు దినేష్ కార్తీక్‌ను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ గాయపడ్డాడు. దీంతో తదుపరి మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయం సందిగ్ధంగా మారింది. అటు టీమిండియా వచ్చే పర్యటనలలో కూడా కార్తీక్‌ను సెలక్టర్లు తీసుకోకపోవడంతో అతడు కెరీర్‌లో చివరి టీ20 మ్యాచ్ ఆడేశాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే కార్తీక్‌పై పనిభారాన్ని తగ్గించడానికే న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టూర్లకు ఎంపిక చేయలేదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చెప్పాడు. అయితే సెలెక్టర్లు ఇప్పుడు 2024లో జరిగే ప్రపంచ కప్ ఎడిషన్ కోసం వేరే సెటప్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే దినేష్ కార్తీక్ కోసం ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయని చేతన్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం కార్తీక్ కారణంగా పంత్‌కు మరిన్ని అవకాశాలు దక్కడం లేదు.
Team India:
మరోవైపు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో కూడా టీమిండియాకు వికెట్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. యువ ఆటగాళ్లను పక్కన పెట్టుకుని దినేష్ కార్తీక్ లాంటి వెటరన్ ఆటగాడిపై అతిగా ఆధారపడటం మంచిది కాదని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్‌కు 37 ఏళ్లు. వచ్చే టీ20 ప్రపంచకప్ నాటికి అతడు 39 వయసులోకి అడుగుపెడతాడు. అప్పటి వరకు కార్తీక్ కెరీర్ కొనసాగించడం కష్టంగానే కనిపిస్తోంది.