ఏపీలో రానున్న ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని పార్టీని యువరక్తంతో నింపేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. టీడీపీలో చంద్రబాబు తర్వాత ఆ స్థానం లోకేష్ ఉన్నారు. ఇక లోకేష్ నాయకత్వ లక్షణాలుపెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లోకేష్ బలంగా జనంలోకి వెళ్ళాలంటే అతని పక్కన బలమైన యువరక్తం ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే సీనియర్స్ అందరికి స్మూత్ గా రాబోయే ఎన్నికలకి సంబందించిన తన వ్యూహాలని చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉత్తరాంద్రతో పాటు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలలో టీడీపీలోని సీనియర్ నాయకుల స్థానంలో వారి కొడుకులు, కూతుళ్ళు ఈ సారి ఎమ్మెల్యేలుగా బరిలో నిలబడే ఛాన్స్ కనిపిస్తుంది.
ఇప్పటికే వారంతా రాజకీయాలలో చురుకుగా ఉంటూ లోకేష్ సారధ్యంలో పనిచేస్తున్నారు. వీరందరూ కూడా రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే పరిటాల శ్రీరామ్ కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నాడు. అదే సమయంలో ఉత్తరాంద్ర నుంచి కిమిడి నాగార్జున, గౌతు శిరీష, ప్రతిభాబారతి కూతురు, బండారు సత్యనారాయణ కొడుకు, చింతకాయల విజయ్ వంటి వారు ఎమ్మెల్యేలుగా బరిలో నిలబడే అవకాశం ఉంది.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న యువ నాయకత్వం చూసుకుంటే కనీసం 50 మంది వరకు వారసులే ఎమ్మెల్యేలుగా టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక వేళ గెలిస్తే మంత్రి పదవులు కూడా వీరిలో కొంత మందిని వరించవచ్చు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని యువరక్తంతో పార్టీని కొత్త ఉత్తేజం తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ బాద్యతలని తనయుడు లోకేష్ కి అప్పగించారు. ఇక యువనాయకత్వం ఉంటే యువతలోకి బలంగా టీడీపీ అజెండాని తీసుకెళ్లగలరని భావిస్తున్నట్లు తెలుస్తుంది.