ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ బలమైన ఓటుబ్యాంకుని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో కూడా 40 శాతంకి పైగా టీడీపీ ఒంటింగ్ సొంతం చేసుకుంది. అప్పుడు కొంత వ్యతిరేకత, జగన్ ని ఒకసారి చూడాలని ప్రజలు అనుకోవడం, అలాగే పవన్ కళ్యాణ్ కారణంగా జరిగిన డ్యామేజ్ తో 12 శాతం వరకు తటస్థంగా ఉన్న ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపించారు. ఈ కారణంగానే వైసీపీకి భారీ ఆధిక్యం వచ్చింది. అయితే వైసీపీకి గత ఎన్నికలలో వచ్చిన 154 సీట్లు శాశ్వతం అనే భ్రమలో వాళ్ళు ఉన్నారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అందుకే ఇష్టారీతిలో ప్రశ్నించే వారిపైన దాడులు చేస్తూ, అలాగే ప్రతిపక్షాలని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బూతులతో రెచ్చిపోతున్నారు. ఇది వైసీపీకి యాంటీగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏపీలో కూడా విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక అతని వ్యూహాన్ని పసిగట్టిన చంద్రబాబు ముందుగానే మేల్కొని తెలంగాణలో కూడా టీడీపీకి ఉన్న ఓటుబ్యాంకుని మళ్ళీ దారిలోకి తెచ్చుకోవడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఉండదని కొంత మంది నాయకులు బీఆర్ఎస్ వైపు వెళ్తే మరికొంత మంది కాంగ్రెస్ కి వలస వెళ్ళిపోయారు. అయితే కొంత మంది కరుడుగట్టిన టీడీపీ వాదులు మాత్రం పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు వారందరితో చంద్రబాబు నాయుడు ఖమ్మం వేదికగా శంఖారావం పెట్టి తెలంగాణలోని అన్ని పార్టీలకి గుబులు పుట్టించారు. తెలంగాణలో టీడీపీ పార్టీకి ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేకపోయిన పార్టీ కోసం పనిచేసే బలమైన క్యాడర్ ఉంది. 2014లో బలమైన తెలంగాణ వాదంలో కూడా కొన్ని స్థానాలని టీడీపీ కైవసం చేసుకుంది.
తరువాత చంద్రబాబు నాయుడు ఏపీపైనే పూర్తిగా దృష్టిపెట్టి తెలంగాణాని విస్మరించారు. దీంతో చాలా మంది గెలిచిన నాయకులు కూడా ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ రానున్న ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు తెలంగాణలో టీడీపీని యాక్టివ్ చేసారు. అక్కడ కార్యకర్తలకి పోటీ చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అన్ని పార్టీలలో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి భయం స్టార్ట్ అయ్యింది. దీనికి కారణం టీడీపీకి చెందిన చాలా క్యాడర్ టీఆర్ఎస్ పార్టీకి గతం ఎన్నికలలో ఓటు వేసింది. అయితే చంద్రబాబు ఈ సారి అభ్యర్ధులని బరిలో దించుతామని చెప్పడంతో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది.
గణనీయంగా ఆ పార్టీ ఓటుబ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండానే ఆ పార్టీకి చంద్రబాబు సహకరించినట్లు అవుతుంది. ఒక వేళ కొన్ని స్థానాలలో గెలిచినా కూడా కచ్చితంగా బీజేపీకి మద్దతు ఇస్తాడు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు ఎఫెక్ట్ మళ్ళీ తమపై పడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి ఎదురుదాడి మొదలు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అయితే చంద్రబాబు కచ్చితంగా తెలంగాణలో తనకున్న బలమైన ఓటుబ్యాంకుతో బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు దెబ్బ తీసే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.