ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీకి తెలంగాణలో అనుకున్న స్థాయిలో రాష్ట్రస్తాయిలో ప్రభావితం చేసే నాయకత్వం కనిపించడం లేదు. అయితే ఇప్పటికి కూడా టీడీపీకి తెలంగాణలో బలమైన క్యాడర్ ఉంది. వారిని నడిపించి దిశానిర్దేశం చేసే నాయకత్వం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక టీఆర్ఎస్ కి పోటీ ఇచ్చే స్థాయిలోకి బీజేపీ పార్టీ తన ఇమేజ్ ని పెంచుకుంటుంది. అయితే బీజేపీని వ్యతిరేకించే వారు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అయితే వీరు కాంగ్రెస్ పార్టీతో కొనసాగడానికి ఆ పార్టీలో ఉన్న అనిశ్చితి ప్రధాన సమస్యగా మారింది. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లి ఆ పార్టీని నాశనం చేసాడని కాంగ్రెస్ సీనియర్స్ అందరూ భావిస్తున్నారు.
అయితే ఏపీతో పాటు తెలంగాణలో కూడా టీడీపీ ఇమేజ్ ని మళ్ళీ ఒకప్పటి స్థాయికి పెంచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ టీడీపీ బాద్యతలని బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కి అప్పగించారు. ఆయన నేతృత్వంలోని తెలంగాణలోని పార్టీలో బలమైన నాయకులని తయారు చేసి స్తబ్దుగా ఉన్న క్యాడర్ ని మళ్ళీ ఉత్సాహం నింపాలని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో చాలా కాలం తర్వాత టీడీపీ శంఖారావం పేరుతో బారీ బహిరంగ సభని నిర్వహించడానికి రెడీ అవుతుంది.
ఖమ్మంలో సర్దార్ పటేల్ మైదానంలో టీడీపీ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ సభకి 25 జిల్లాల నుంచి టీడీపీ పార్టీ క్యాడర్ ని, కార్యకర్తలని పెద్ద ఎత్తున తరలించి బలనిరూపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సభకి హైదరాబాద్ నుంచి అధినేత చంద్రబాబు భారీ వాహనాలతో ర్యాలీగా తరలి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ క్యాడర్ ని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు రానున్న ఎన్నికలకి ఎలా వెళ్ళాలనే విషయాలపై దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తుంది.