ఏపీలో ప్రతిపక్షాలని కంట్రోల్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం రకరకాల సెక్షన్స్ ని అమల్లోకి తీసుకొస్తుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పర్యటిస్తా అని చెప్పిన మరుసటి రోజే ఆ ప్రాంతంలో సెక్షన్ 30 అమల్లోకి వచ్చేస్తుంది. పర్యటన సందర్భంగా ర్యాలీలు చేయాలన్నా, రోడ్ షోలు చేయాలన్నా, లేదంటే సభలు పెట్టాలన్నా కూడా ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఆ సమయంలో వైసీపీ నాయకులకి సంబందించిన సభలు, సమావేశాలు ఆ ప్రాంతంలో ఉంటే మాత్రం పోలీసులు పర్మిషన్ ఇవ్వరు. లేదంటే రోడ్ షోలకి కాకుండా కేవలం సభలకి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఇక అర్ధంతరంగా ఎవరైనా నాయకులు పర్యటిస్తే సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి మీరు తిరగడానికి వీలులేదని చెబుతారు.
అలాగే సెక్షన్ 30 అమల్లో ఉంటే ప్రతిపక్షాలు కనీసం ఫ్లెక్సీలు కూడా కట్టకూడదు. అదే వైసీపీ నాయకులు ఏమైనా చేసుకోవచ్చు అనే విధంగా ఏపీలో అధికార పార్టీ పంథా ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇప్పటికే జీవో నెంబర్ 1 తో ప్రతిపక్షాలని అణచివేసే కుట్ర చేసింది. అయితే ప్రతిపక్షాల నుంచి దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.హైకోర్టు కూడా ఈ జీవోని సస్పెండ్ చేసింది. అయితే దీనిపై వైసీపీ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచన చేస్తుంది.
అయితే అక్కడ కూడా వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సెక్షన్ 30ని అడ్డుపెట్టుకొని వైసీపీ ప్రతిపక్షాలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా అధికార పార్టీ వేధింపులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే వైసీపీ ధోరణిని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళి వారిపై వ్యతిరేకత పెంచాలని టీడీపీ కూడా ఆలోచిస్తుంది. ఆ దిశగానే అడుగులు వేస్తుంది.