ఏపీలో రాజకీయం రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. ఎలా అయినా మళ్ళీ అధికారం నిలుపుకోవడమే కాకుండా ఏకంగా 175 స్థానాలని సొంతం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకి అల్టిమేటం జారీ చేస్తున్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో నాయకులకి ఎప్పటికప్పుడు పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకత పోగొట్టే ప్రయత్నం చేయాలని, అందరికి నాయకులు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలని ఆదేశిస్తున్నారు. అలాగే పార్టీ క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేయాలని కూడా చెబుతున్నారు. మరో వైపు ప్రతిపక్ష టీడీపీ కూడా ప్రజలలోకి వెళ్లి మళ్ళీ నమ్మకాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
70 ఏళ్ల వయస్సులో కూడా అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా తిరుగుతూ అధికార పార్టీపై విమర్శలతో క్యాడర్ కి నూతన ఉత్సాహం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబుకి మళ్ళీ మునుపటి స్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని చెబుతున్నారు. అయితే టీడీపీ పార్టీలో అంతర్గత విభేదాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. పార్టీ నేతలు నేరుగా అధినేతపైనే ఊహించని విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి సోషల్ మీడియా ద్వారా బయటకి వస్తూ వైరల్ అవుతున్నాయి. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. చంద్రబాబుక్కి మళ్ళీ గెలిచే సత్తా లేదని, వచ్చే ఎన్నికలలో టీడీపీఐ 50 నుంచి 60 సీట్లు మాత్రమే వస్తాయని వ్యాఖ్యలు చేశారు.
టీడీపీకి పరాజయం తప్పదని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే టీడీపీక్కి ఏక్ నాథ్ షిండేలా కొందరు నాయకులు ఉన్నారని. వారు అందరూ కలిసి టీడీపీ ఎమ్మెల్యేలని మెల్లగా బీజేపీ వైపు లాక్కునే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. చంద్రబాబు కబుర్లు చెప్పే వారిని తప్ప నిజాలు చెప్పేవారిని నమ్మడం లేదని కూడా విమర్శించినట్లు సమాచారం. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే శక్తి, ఆలోచన బాబుగారికి లేవని అన్నట్లు తెలుస్తుంది. కేశినేని వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలోనే కాకుండా ఏపీ రాజకీయాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఏ ఉద్దేశ్యంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది తెలియాల్సి ఉంది.