తాను ఇక్కడే ఉంటా… ఇక్కడి ప్రజలకి మెరుగైన జీవితం కోసమే తాను తాపత్రయపడతాను అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కమలాపురం సభలో టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఒక రాష్ట్రంలో, మరో రోజు పక్క రాష్ట్రంలో ఉండి రాజకీయాలు చేయనని ఏపీ ప్రజలని నమ్ముకున్నా అని ఏపీలోనే ఉంటానని జగన్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలని టార్గెట్ చేస్తూ చేసినవి అనే సంగతి అందరికి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు తెలంగాణలో కూడా పార్టీ క్యాడర్ ని తిరిగి ఉత్తేజం చేసి వచ్చే ఎన్నికలలో అక్కడ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి కౌంటర్ గా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ చేసిన కామెంట్స్ కి దీటుగానే చంద్రబాబు కూడా తిరిగి వైసీపీ నాయకులకి, జగన్ కి కౌంటర్ ఎటాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంద్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు రోడ్ షోలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ స్థాపించారని, అలాగే తెలుగు ప్రజలు ఎక్కడున్న వారి హక్కుల కోసం పోరాటం చేయడం మా సిద్ధాంతంలో భాగం అని గుర్తు చేశారు. తెలుగు ప్రజలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఉంటుందని, ఆ రాష్ట్రంలో తెలుగు ప్రజల హక్కుల కోసం రాజకీయ పోరాటం చేస్తుందని అన్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్రా వేరుపడిన అందరూ తెలుగు ప్రజలే అని గుర్తు చేశారు.
అందుకే తెలంగాణలో కూడా తాను ఖమ్మంలో సభ పెట్టగానే వేలాది మంది హాజరయ్యారని అన్నారు అక్కడి ప్రజలు కూడా తెలుగు దేశాన్ని కోరుకుంటున్నారు అని అన్నారు. ఇక తెలంగాణలో సభ విజయవంతం అవ్వడం జగన్ కి అస్సలు మింగుడుపడటం లేదని. బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఏపీలో టీడీపీని దెబ్బతీయాలని చూసిన జగన్ కి చంద్రబాబు కోలుకోలేని విధంగా ఖమ్మం సభతో సమాధానం చెప్పారని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఏపీలో ఉన్న ప్రజల కోసం వైసీపీ అంటే, దానికి కౌంటర్ గా తెలుగు ప్రజలందరి కోసం తెలుగుదేశం అని చెప్పడంతో సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.