సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు మీద జనసేన నాయకులు బాధితుల సొమ్ములు తీసుకున్నారనే ఆరోపణలు చేయడంతో పాటు మంగమ్మ అనే మహిళకి వచ్చిన ఐదు లక్షల పరిహారంలో సగం తనకి ఇవ్వాలని డిమాండ్ చేసారని తెరపైకి తీసుకొచ్చారు. ఇక తాను బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అంబటి రాంబాబు చాలెంజ్ చేసిన మరుసటి రోజే మంగమ్మకి జరిగిన నష్టాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే అంబటి రాంబాబు మాటమీద నిలబడి రాజీనామా చేయాలనీ జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మంగమ్మకి న్యాయం చేయాలని నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూపై టీడీపీ నాయకులు కూడా ఆందోళనలు మొదలు పెట్టారు.
అంబటి రాంబాబు బాధితుల సొమ్ములు కూడా కాజేస్తున్నారు అంటూ విమర్శించారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే ఎంక్వయిరీ వేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంబటి రాంబాబుని వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సత్తెనపల్లిలో మంగమ్మకి వైసీపీ వాళ్ళు ఫోన్స్ చేసి చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని ఆమె పోలీసులని ఆశ్రయించింది. ఆ బెదిరింపులపై కూడా జనసేన, టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
మంగమ్మ కుటుంబానికి ఎలాంటి హాని జరిగిన దానికి ప్రభుత్వమే పూర్తి బాద్యత వహించాలని అంటున్నారు. ఇక కొల్లు రవీంద్ర సారధ్యంలో మంగళగిరి మహిళ కమిషన్ కార్యాలయం వద్ద అంబటి రాంబాబుపై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ నిరసన తెలియజేసారు. మరో వైపు మాచర్లలో వైసీపీ సృష్టించిన విద్వంసం, టీడీపీ నాయకులని లక్ష్యంగా చేసుకొని చేసిన దాడులపై గవర్నర్ కి టీడీపీ అధిష్టానం ఫిర్యాదు చేయనుంది. పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారిపోయి వారి మీద యాక్షన్ తీసుకోకుండా బాధితులపైనే తిరిగి కేసులు పెట్టారని గవర్నర్ దృష్టికి తీసుకొని వెళ్ళబోతున్నారు.