టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగుపెట్టి ఖమ్మంలో వేదికంగా నిర్వహించగా టీడీపీ శంఖారావంలో క్యాడర్ ని ఉద్దేశించి మాట్లాడటంతో పాటు టీడీపీ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేసింది. అసలు టీడీపీ హయాంలో జరిగిన సంక్షేమం ఏంటి అనే విషయాలని చంద్రబాబు తెలియజేశారు. అలాగే ఈ రోజు హైదరాబాద్ దేశంలో ఐటీ హబ్ గా ప్రాచూర్యం పొందడంతో పాటు ప్రపంచ దేశాలలో అగ్ర కంపెనీలు అన్ని కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి అంటే దానికి కారణం తాను ఐటీ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన సంస్కరణలే అని పేర్కొన్నారు. ఐటెక్ సిటీ, సైబరాబాద్ నిర్మాణం వెనుక తన నిరంతర తపన ఉందని, ప్రపంచ దేశాలు అన్ని తిరిగి ఎంతో మందిని కలిసి పెట్టుబడులు పెట్టాలని కోరడం జరిగిందని తెలిపారు.
అలా తాను ఐటీ అభివృద్ధి కోసం వేసిన పునాదుల కారణంగా ఈ రోజు ఐటీ పరిశ్రమలు అంటే హైదరాబాద్ పేరు వినిపిస్తోందని అన్నారు. ఇక చాలా కాలంగా ఎవరికి ఓటు వేయాలో అర్ధం కాక స్తబ్ధుగా ఉన్న టీడీపీ క్యాడర్ ని చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. అలాగే తెలుగు దేశం అంటే తెలుగు ప్రజలందరి కోసం పనిచేసే పార్టీ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో టీడీపీ బలంగా పోటీ చేస్తుందని క్యాడర్ కి తెలియజేయడం ద్వారా ఉత్తేజం నింపారు. అయితే ఖమ్మంలో సభ ద్వారా తెలంగాణాలో టీడీపీ రాజకీయాలు మళ్ళీ మొదలు పెట్టబోతున్నట్లు చంద్రబాబు సాంకేతాలు ఇచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఆ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు చంద్రబాబు మీద విమర్శల దాడి మొదలు పెట్టారు. తెలంగాణాలో, ఆంధ్రాలో బీజేపీని దగ్గర చేసుకోవడానికి చంద్రబాబు కొత్త ఎత్తులు వేస్తున్నాడని, అందులో భాగంగానే తనకి బలం ఉందని నిరూపించుకోవడానికి సభ పెట్టాడని మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు.
ఇక ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే తరహాలో కేవలం బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలో భాగంగానే ఈ సభ జరిగిందని అన్నారు. ఇక టీఆర్ మంత్రులు,ఎమ్మెల్యే లు కూడా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేశారు. అందరూ కూడా కేవలం చంద్రబాబు బీజేపీకి దగ్గరవడానికి మళ్ళీ తెలంగాణ ప్రజలని తన మాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీలో వైసీపీ నాయకులు కూడా ఇదే తరహాలో విమర్శలు చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ, వైసీపీకి మద్దతు ఇచ్చి ఏపీలో రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తుందని ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు వ్యూహం వర్క్ అయ్యిందని, ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైసీపీ ఒకే తరహాలో విమర్శలు చేయడం ద్వారా ఇరుకున పడబోతున్నాయి అంటూ తెలుగుదేశం అభిమానులు చెప్పుకుంటున్నారు.