సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం హిందీలో నటించిన బాబ్లీ బౌన్సర్ సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ కి రెడీ అవుతుంది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హిందీతో పాటు తెలుగు, తమిళ్ బాషలలో రిలీజ్ చేయబోతున్నారు. సౌత్ లో తమన్నాకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాకి డబ్ చేసి తెలుగు, తమిళ్ బాషలలో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే రిలీజ్ టైం ట్రైలర్ ఆకట్టుకుందని చెప్పాలి. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ బట్టి తెలుస్తుంది. అలాగే లేడీ బౌన్సర్ గా తమన్నా పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే సినిమా ప్రమోషన్ ని షురూ చేసింది.
తాజాగా బాబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్ కోసం తమన్నా, మధుర్ బండార్కర్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమన్నా బౌన్సర్లు కాస్తా అతి చేశారు. మీడియా వారిపై దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు వారితో వాగ్వాదానికి దిగారు. బౌన్సర్ల హడావిడి కారణంగా మీడియా సమావేశం కొంత సేపు గందరగోళంగా మారింది. ఇదే సమయంలో ఈ సమావేశాన్ని బాయ్ కట్ చేయాలని మీడియా ప్రతినిధులు భావించడంతో అది తమన్నా వరకు చేరింది.
ముందుగా పీఆర్వోలు ఈ గొడవని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. బౌన్సర్లతో క్షమాణలు చెప్పించారు. అయితే సినిమా ప్రమోషన్ సమయంలో ఇలాంటి గొడవ మీడియా వారితో జరిగితే మూవీపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉందని గ్రహించిన చిత్ర యూనిట్ మరోరకంగా వారిని కూల్ చేసే ప్రయత్నం చేశారు. సమావేశానికి వచ్చిన మీడియా బృందంతో తమన్నా ఫోటోలు దిగింది. వీటిని సోషల్ మీడియాలో పెట్టి గొడవ సద్దుమణిగింది అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఇక తమన్నా వారికి సారీ చెప్పి ఫోటోలు దిగడంతో మీడియా ప్రతినిధులు కూడా శాంతించినట్లు తెలుస్తుంది.