T20 World Cup: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. దక్షిణాఫ్రికాపై గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 185 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే పాకిస్థాన్ బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కకావికలం అయ్యింది. అందులోనూ వర్షం పడటంతో టార్గెట్‌ను 14 ఓవర్లలో 142 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. కానీ దక్షిణాఫ్రికా కేవలం 108 పరుగులే చేసి పరాజయం పాలైంది.
దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ గెలుపుతో గ్రూప్-2లో సెమీస్ బెర్తులు ఇంకా ఖరారు కాలేదు. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే తదుపరి మ్యాచ్‌లలో భారత్, దక్షిణాఫ్రికా ఓడిపోవాల్సి ఉంటుంది. అంటే నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా, జింబాబ్వేపై టీమిండియా ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే పాకిస్థాన్‌కు అవకాశం ఉంటుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 8 పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుతుంది. కానీ పాకిస్తాన్ అభిమానులంతా ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు.
ఈ ప్రపంచకప్‌లో తమపై ఆడిన విధంగా టీమిండియాపైనా జింబాబ్వే అద్భుతంగా ఆడాలని పాకిస్థాన్ అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇటీవల భారత్‌పై బంగ్లాదేశ్ గెలవాలని కోరుకున్నా అది నెరవేరలేదు. దీంతో ఇప్పుడు వాళ్ల దృష్టి జింబాబ్వే మ్యాచ్‌పై పడింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన నటి సెహర్ షిన్వారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జింబాబ్వే జట్టు తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తే.. తాను ఆ దేశపు వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్‌లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
T20 World Cup: ఇంకా పేరు మార్చుకోలేదేం?
పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ ఇటీవల భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ముందు కూడా ఇలాంటి ట్వీటే చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోతే తన ట్విట్టర్ ఖాతా డిలీట్ చేసేస్తానని వెల్లడించింది. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. దీంతో ఈ ట్వీట్‌ను ఆమెకు గుర్తు చేస్తున్న నెటిజన్లు.. ముందు ఈ మాట నిలబెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు. ఊరికే శపథాలు చేయడం కాదని చేసి చూపించాలని మండిపడుతున్నారు.