T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-2లో అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడేసినా ఇంకా సెమీస్ బెర్తులు ఖరారు కాలేదు. ప్రస్తుతానికి టీమిండియా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 5 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. నాలుగు పాయింట్లతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్‌కు సెమీస్ అవకాశాలు లేవు.అయితే ఈ ఆరు జట్లు ఆదివారం నాడు తమ చివరి మ్యాచ్ ఆడనున్నాయి. దీంతో సెమీస్ బెర్తులు ఆ రోజే ఖరారవుతాయి.
గ్రూప్-2కు సంబంధించి ఆదివారం నాడు మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ముందుగా అడిలైడ్ వేదికగా నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే ఆ జట్టు పాయింట్లు 7కి చేరతాయి. అప్పుడు పాయింట్ల టేబుల్‌లో టాప్‌కు చేరుతుంది. రెండో మ్యాచ్ కూడా అడిలైడ్‌లోనే జరుగుతుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఈ కీలక మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికి 6 పాయింట్లు వస్తాయి. అప్పుడు భారత్‌తో సమానంగా ఆ జట్టు నిలుస్తుంది.
అటు మూడో మ్యాచ్ టీమిండియా జింబాబ్వేతో ఆడుతుంది. అప్పటికీ గ్రూప్‌లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. తమతో సమానంగా నిలిచే జట్టు నెట్ రన్‌రేట్ తెలిసిపోతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా 8 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే చెరో పాయింట్ వస్తుంది కాబట్టి టీమిండియా ఖాతాలో 7 పాయింట్లు ఉంటాయి. అప్పుడు గ్రూప్‌లో రెండో జట్టుగా భారత్ సెమీస్ చేరుతుంది.
T20 World Cup: భారత్ ఓడితే పరిస్థితేంటి?
ఒకవేళ పాకిస్థాన్ తరహాలో టీమిండియాకు జింబాబ్వే షాక్ ఇస్తే అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ జట్ల ఖాతాలో ఆరు పాయింట్లు ఉంటాయి. అప్పుడు వాళ్ల కంటే మెరుగైన రన్‌రేట్ ఉంటే టీమిండియా సెమీస్ చేరడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చిత్తుగా ఓడితే మాత్రం సెమీస్ అవకాశాలు గల్లంతు అవుతాయి. ప్రస్తుతానికి ఫామ్ ప్రకారం భారత్ ఈ మ్యాచ్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. టోర్నీలో ఇప్పటికే మూడు అర్ధశతకాలతో విరాట్ కోహ్లీ ఊపు మీద ఉన్నాడు. అతడికి సూర్యకుమార్ లేదా హార్దిక్ పాండ్యాలలో ఒకరు సహకరించినా భారత్ చెలరేగడం ఖాయం.