T20 World Cup: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి జట్లు రాణిస్తున్నా ఆయా జట్లలో పలువురు ఆటగాళ్లు మాత్రం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో ఉన్నారు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మూడు, నాలుగు మ్యాచ్‌లు ఆడినా వీళ్లు మాత్రం చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. దీంతో ఆయా ఆటగాళ్లపై విమర్శకులు మండిపడుతున్నారు. జట్ల నుంచి వాళ్లను తప్పించి వేరే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మెగాటోర్నీలో టీమిండియా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లను ఆడింది. ఈ మూడు మ్యాచ్‌లలోనూ కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులే చేశాడు. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ 9 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో తదుపరి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు.
అటు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఫామ్ కోల్పోయి సతమతం అవుతున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పొషించిన వార్నర్ ప్రస్తుతం విఫలం అవుతుండటంతో ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో 5 పరుగులు చేసిన వార్నర్.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కాగా సోమవారం నాడు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వార్నర్ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు.
T20 World Cup:
దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాది ఇదే పరిస్థితి. జింబాబ్వేతో దక్షిణాఫ్రికా ఆడిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. బంగ్లాదేశ్‌త్ జరిగిన మ్యాచ్‌లో బవుమా 2 పరుగులు చేశాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లోనూ 10 పరుగులకే అవుటయ్యాడు. అటు ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా ఫామ్ లేమితో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. టీమిండియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో అతడు డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత జింబాబ్వేపై 4 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా నాలుగే పరుగులు చేశాడు. దీంతో బాబర్ ఆజం ఓ చెత్త కెప్టెన్ అని మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ విమర్శలు సంధించాడు.