Supreme Court: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించిన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వారు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
శుక్రవారం విచారణ జాబితాలోకి కేసు..
నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఈ నిర్ణయాన్ని నిందితులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను సీజేఐ ధర్మాసనం ముందు నిందితుల తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా శుక్రవారం విచారణ చేపట్టే కేసుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
తెలంగాణలో మునుగోడు ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నించిందని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మీడియాకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిలను బీజేపీ కొనుగోలు చేయాలని యత్నించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
Supreme Court:
మొయినాబాద్ శివార్లలోని ఫాంహౌస్ లో ఈ తతంగా నడిపించారు. మీడియేటర్లుగా రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి లు వ్యవహరించారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ తరఫున ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. హైకోర్టు కూడా ఇందుకు సమ్మతించింది. ఈ నేపథ్యంలో నిందితులు సుప్రీంను ఆశ్రయించారు.