Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ అనారోగ్యం కారణంగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1942 మే 31న జన్మించగా.. స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం. ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. కుటుంబంలో ఆయనే పెద్ద కుమారుడు. ఘట్టమనేని కృష్ణకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు.
విద్యాభ్యాసం విషయానికి వస్తే ఘట్టమనేని కృష్ణ ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నారు. తొలుత గుంటూరు కాలేజీలో ఈ సీటు కోసం ప్రయత్నించగా ఆయనకు దొరకలేదు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో ఇంటర్ విద్యను పూర్తి చేశారు. అయితే అక్కడ మూడు నెలలే చదివారు. అనంతరం ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలకు మారారు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి తర్వాత బీఎస్సీ చదివారు. నటుడు మురళీమోహన్, కృష్ణ క్లాస్ మేట్స్.
ఘట్టమనేని కృష్ణ డిగ్రీ చదువుతున్న సమయంలో ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలని ఆకాంక్షించారు. అలా సినిమాల మీద ప్రేమ పెంచుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించినా కృష్ణకు సీటు రాలేదు. దీంతో డిగ్రీ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు.
Superstar Krishna: డిగ్రీ తర్వాత సినీ రంగ ప్రవేశం
‘తేనె మనసులు’ సినిమా ద్వారా ఘట్టమనేని వెండితెరకు పరిచయం అయ్యారు. ‘గూఢచారి 116’ సినిమాతో గుర్తింపు పొందారు. తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే కృష్ణకు ఇందిరతో వివాహం అయింది. 1965 అక్టోబర్ 13 నాటికి పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి సినిమా నిర్మాతగా కొనసాగాడు. చిన్న కొడుకు మహేష్ బాబు స్టార్ హీరోగా సెటిల్ అయ్యాడు. కుమార్తె మంజుల నటన, నిర్మాణం, దర్శకత్వం రంగాల్లో రాణిస్తున్నారు.