Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మహేష్‌బాబు ఫ్యామిలీలో ఈ ఏడాది వరుసగా ఇది మూడో విషాదం కావడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జనవరిలో సోదరుడు రమేష్‌బాబు మరణం, ఆగస్టులో తల్లి ఇందిరాదేవి మరణం, నవంబరులో తండ్రి మరణం మహేష్‌బాబును మానసికంగా కుంగదీశాయని చెప్పవచ్చు. అయితే మహేష్ కుమార్తె సితార అంటే సూపర్‌స్టార్ కృష్ణకు ఎంతో ఇష్టం.
సూపర్‌స్టార్ కృష్ణకు తన తల్లి అంటే ఎంతో ప్రేమ. అందుకే తన తల్లిని మహేష్ కుమార్తె సితారలో చూసుకునేవాళ్లు. ఈ నేపథ్యంలో ఇందిరాదేవి ఉన్నప్పుడే సితారకు ఓనీల ఫంక్షన్ చేయాలని మహేష్‌ను కృష్ణ అడిగారట. కానీ ఈ విషయంలో తన తండ్రి మాటను మహేష్ వ్యతిరేకించినట్లు ఫిలింనగర్‌లో ప్రచారం సాగుతోంది. మాములుగానే ఆడంబరాలకు మహేష్ దూరంగా ఉంటాడు. దీంతో తన కుమార్తె ఓనీల ఫంక్షన్ నిర్వహించేందుకు మహేష్ ఆసక్తి చూపలేదు.
అయితే తల్లి మరణం తర్వాత మహేష్ మనసు మార్చుకున్నాడు. తల్లి చివరి కోరిక, తండ్రి ఇష్టానుసారం తన కుమార్తె ఓనీల ఫంక్షన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో కృష్ణ కూడా తన మనవరాలి వేడుక చూసేందుకు సిద్ధమయ్యారు. మరో 10 రోజుల్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా చేయాలని మహేష్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇంతలో తండ్రి కృష్ణ అనారోగ్యం బారిన పడటంతో ఈ ఫంక్షన్ ఏర్పాట్లను వాయిదా వేసినట్లు సమాచారం అందుతోంది. కానీ తన చివరి కోరిక తీరకుండానే కృష్ణ తుదిశ్వాస విడిచారు.
Superstar Krishna: సూపర్‌స్టార్ మరణంపై ఘట్టమనేని ఫ్యామిలీ ప్రకటన
సూపర్‌స్టార్ కృష్ణ మృతిపై ఘట్టమనేని ఫ్యామిలీ మంగళవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఆయన నిజజీవితంలోనూ సూపర్ స్టారే. ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మా కుటుంబానికి కృష్ణ మరణం తీరని లోటు. ఆయన ఎంతోమందికి ఆదర్శం’ అంటూ ఈ ప్రకటనలో ఘట్టమనేని ఫ్యామిలీ పేర్కొంది. కాగా సూపర్‌స్టార్ కృష్ణ 350 సినిమాలకు పైగా నటించి చిత్ర సీమలో రికార్డు నెలకొల్పారు.