Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ నట శేఖరుడిగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. చలన చిత్ర రంగంలో ఎన్నో మార్పులకు కారణమయ్యారు. ప్రస్తుతం ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కృష్ణకు ఇద్దరు కుమారులు ఉన్నా ఇప్పటికే పెద్ద కుమారుడు కూడా మరణించడం జరిగింది. కృష్ణ-ఇందిరా దేవి దంపతులకు రమేష్ బాబు, మహేష్‌బాబు కుమారులు ఉన్నారు. రమేష్‌బాబు నిర్మాతగా స్థిరపడగా మహేష్ హీరోగా రాణిస్తున్నాడు.
రమేష్‌బాబు విషయానికి వస్తే 1965లో అక్టోబర్ 13న చెన్నైలో జన్మించాడు. 1974లో తన తండ్రి కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. మనుషులు చేసిన దొంగలు, నీడ, పాలు నీళ్లు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. బాలనటుడిగా రాణించడంతో సినిమాలపై మక్కువ పెంచుకున్నాడు. అలా సామ్రాట్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. చివరగా 1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు.
హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత రమేష్‌బాబు నిర్మాతగా రాణించాడు. విక్టరీ వెంకటేష్ నటించిన సూర్యవంశం సినిమాను అమితాబ్ హీరోగా హిందీలో నిర్మించాడు. ఆ తర్వాత తెలుగులో గుణశేఖర్ దర్శకత్వం వహించిన అర్జున్ సినిమాతో పాటు అతిథి, దూకుడు వంటి సినిమాలలో నిర్మాతగా భాగస్వామ్యం తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 8న కాలేయ సంబంధిత వ్యాధితో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో రమేష్‌బాబు తుదిశ్వాస విడిచాడు.
Superstar Krishna: తండ్రి బాటలో రెండో కుమారుడు
రెండో కుమారుడు మహేష్‌బాబు మాత్రం తండ్రి బాటలో నడిచాడు. దీంతో మహేష్ కూడా సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. బాలనటుడిగా 8కి పైగా సినిమాల్లో నటించాడు. నీడ, పోరాటం, శంఖారావం, బజారు రౌడీ, గూడఛారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ఆకట్టుకున్నాడు. 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. కృష్ణ కుమార్తె మంజుల కూడా నటన వైపు మొగ్గు చూపారు. ఆమె కూడా ఒకవైపు నటిస్తూనే మరోవైపు నిర్మాత, దర్శకురాలిగా రాణిస్తున్నారు.