Superstar Krishna: టాలీవుడ్ జేమ్స్ బాండ్ కృష్ణ వయసు రీత్యా, అనారోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. కృష్ణ మరణించడంతో ఆయన అభిమానులు సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే కృష్ణ సినీ రంగ ప్రవేశం ఆసక్తికరంగా జరిగింది. ఆయనకు సినిమా అవకాశాలు సులభంగా ఏమీ లభించలేదు.
డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ సీటు రాకపోవడంతో సినిమాల్లో హీరోగా నటించాలని కృష్ణ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. కృష్ణ ఇష్టాన్ని అనుసరించి అతని తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వాళ్లకు పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాసు పంపారు. అప్పటి తెలుగు సినీ రంగానికి కేంద్రమైన మద్రాసులో తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటివారిని కలిసి కృష్ణ తన ఉద్దేశాన్ని వివరించారు.
కానీ అప్పటి కాలంలో హీరోగా నటించాలంటే సరిపడా వయసు కృష్ణకు లేదు. దీంతో వయసు రీత్యా చిన్నవాడు కావడంతో కొంతకాలం ఆగి మద్రాసు రమ్మని గుమ్మడి, చక్రపాణి, జగ్గయ్య లాంటి పెద్దలు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించారు. అలా మద్రాసులోనే నాటకాల్లో నటించడం ప్రారంభించి సక్సెస్ అయ్యారు. మద్రాసులో వేసిన ‘చేసిన పాపం కాశీకి వెళ్ళనా?’అనే నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించాడు. ఈ నాటకంతో గుర్తింపు రావడంతో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో విజయవాడ జింఖానా మైదానంలో గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన ఛైర్మన్ నాటకంలో ఛైర్మన్ కుమారుడి పాత్రను కృష్ణ పోషించి ఆకట్టుకున్నారు.
Superstar Krishna: చిన్న వేషాల నుంచి హీరోగా మారారు
అనంతరం తిరిగి మద్రాసు వెళ్లి సినిమాల కోసం ప్రయత్నించగా ఎల్వీ ప్రసాద్ తీస్తున్న కొడుకులు-కోడళ్ళు అనే సినిమాలో ఒక పాత్రకు ఎంపిక చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. 1962లో కొంగర జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు అనే సినిమాలో చిన్న పాత్ర పోషించారు. కులగోత్రాలు, పరువు ప్రతిష్ఠ, మురళీకృష్ణ అనే సినిమాల్లోనూ చిన్న పాత్రల్లో కనిపించారు. 1964లో ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తీస్తున్న తేనె మనసులు కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటన చూసిన కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించాడు. పలు వడపోతల తర్వాత మద్రాసుకు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా ఆదుర్తి సుబ్బారావు ఎంపిక చేశారు.