Superstar Krishna: Superstar Krishna: చిత్రసీమలో భలే గమ్మత్తు ఉంటుంది. ఈ రంగంలో హీరోలు ఎక్కువ కాలం రాణిస్తారు. అయితే హీరోయిన్‌లు మాత్రం ఐదారేళ్లకే కనుమరుగు అవుతుంటారు. అందుకే హీరోలకు ఎక్కువ మంది హీరోయిన్‌లతో ఆడిపాడే అవకాశం లభిస్తుంది. ఇప్పటితరం హీరోలు మహా అయితే 20 లేదా 30 మంది హీరోయిన్‌లతో నటించి ఉంటారు. గతంలో హీరోలు ఏడాదికి 10కి పైగా సినిమాల్లో నటించే వాళ్లు. దీంతో పలువురు హీరోయిన్‌లతో నటించే అవకాశం వాళ్లకు దక్కేది.
సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కెరీర్‌లో ఎక్కువ మంది హీరోయిన్‌లతో నటించిన ఘనతను అందుకున్నారు. ఆయన ఏకంగా 80 మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అత్యధికంగా తన సతీమణి విజయనిర్మలతో 50 సినిమాల్లో నటించారు. జయప్రదతో 43, శ్రీదేవితో 31 సినిమాల్లో కృష్ణ కలిసి నటించారు. ఎంతోమంది హీరోయిన్‌లు తమ కెరీర్‌ను కృష్ణ సినిమాతో ప్రారంభించి నీరాజనాలు అందుకున్నారు. ఎందరో వర్ధమాన నాయికలు ఆ రోజుల్లో కృష్ణతో నటిస్తే చాలు మంచి పేరు లభిస్తుందని ఆశించేవారు.
ఈ జాబితాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఉన్నారు. విజయశాంతి తొలిసారిగా కృష్ణ సరసన కిలాడీ కృష్ణుడు అనే మూవీలో నాయికగా నటిస్తూ చిత్రసీమకు పరిచయం అయ్యారు. అలనాటి హీరోయిన్‌లు కాంచన, శారద, భారతి, విజయలలిత, జ్యోతిలక్ష్మీ వంటి తారలతో పాటు 90 దశకంలోని హీరోయిన్‌లు అంబిక, భానుప్రియ, రంభ, రోజా, సౌందర్య, రమ్యకృష్ణ కూడా కృష్ణ సరసన నటించి ఆకట్టుకున్నారు.
Superstar Krishna: అన్ని జోనర్‌లను టచ్ చేసిన నటుడు
సూపర్ స్టార్ కృష్ణ దాదాపుగా అన్ని జోనర్‌లలోనూ నటించిన ఘనతను అందుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రకం ఇలా ప్రతి సినిమాలో కృష్ణ తనదైన ముద్ర వేశారు. అంతేకాకుండా కౌబాయ్ లాంటి సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. అల్లూరి సీతారామరాజు మూవీ కృష్ణ కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోతుంది. సూపర్‌స్టార్ కృష్ణ హీరోగానే కాకుండా దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేతగానూ రాణించడం విశేషం.