Suman : రెబల్ స్టార్ కృష్ణం రాజు అకస్మాత్తుగా మరణించడంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 83 సంవత్సరాల వయసులో ఆయన కాలం చేశారు. గత కొన్నేళ్లుగా కృష్ణం రాజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎవరో ఒకరు పట్టుకుంటే తప్ప మెట్లు ఎక్కడం వంటివి చేయలేకపోతున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యతో కృష్ణం రాజు తొలుత ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడిన కృష్ణంరాజు నేటి తెల్లవారు జామున గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలోలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణం రాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
జూబ్లీహిల్స్‌లోని నివాసానికి కృష్ణంరాజు భౌతికకాయాన్ని తరలించనున్నారు. కృష్ణంరాజుఇంటికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అభిమానులకు చివరి చూపు కోసం మధ్యాహ్నం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియానికి కృష్ణంరాజు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు తరలించనున్నారు. సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. దాదాపు 187 సినిమాల్లో నటించి మెప్పించిన కృష్ణం రాజు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం పొందారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాలో పరమహంస పాత్రలో కృష్ణం రాజు చివరిగా నటించారు.
Suman : కృష్ణంరాజు లేరంటే చాలా బాధగా ఉంది..
కృష్ణంరాజు మృతిపై పలువురు సీనియర్ నటులు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ కృష్ణంరాజు మృతిపై స్పందించారు. ‘‘ఈరోజు ఉదయం లేవగానే నాకు చాలా బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. మా అన్నయ్య, కృష్ణంరాజు గారు ఇక లేరని చెప్పి నాకు తెలిసింది. నాకు చాలా బాధ అనిపించింది. ఆయన చాలా మంచి మనిషి, ఒక మంచి మిత్రుడు, ఒక మంచి ఫిలాసఫర్, నాకు ఎప్పుడు ఏదైనా అడిగినా కూడా సలహాలు చెప్పడం, మనిషి కష్టాల గురించి తెలిసిన వ్యక్తి… కష్టాల నుంచి పైకి వచ్చిన మనిషి.. బీజేపీకి, ఇండస్ట్రీకి అందరికీ చాలా క్లోజ్. ఆయన లేరంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఆయన ఫ్యామిలీకి నా సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని సుమన్ పేర్కొన్నారు.