Suhas : ఇటీవలి కాలంలో హీరోగా మారి మంచి సక్సెస్ అందుకుంటున్నాడు సుహాస్. ఆయన నటించిన ‘కలర్ ఫోటో’ చిత్రం ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తరువాత కూడా సుహాస్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సైతం ఆయనను ఆశీర్వదించారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు కొన్ని షార్ట్ ఫిలింస్‌లో నటించి సుహాస్ పలువురు దర్శకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే ఆయనకు 2015లో దోచేయ్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత పడిపడి లేచేమనసు, మజిలీ చిత్రాలు సుహాస్‌ని ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాలతో సుహాస్ దశ తిరిగిపోయింది.
ఈ సినిమాల్లో నటనకు మెచ్చిన ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ తమ చిత్రానికి సుహాస్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి తీసుకున్నారు. చాందినీ చౌదరీ హీరోయిన్‌గా, సునీల్ కీలక పాత్రలో ఈ సినిమాలో నటించారు. సినిమా అద్భుతమైన విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ముఖ్యంగా సుహాస్‌కి ఈ సినిమా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. నిజానికి హీరో శాడ్ ఎండింగ్స్‌ను తెలుగు ప్రేక్షకులు అంతగా ఒప్పుకోరు. కానీ ఈ సినిమాకు మాత్రం బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు.. ఈ చిత్రానికి జాతీయ అవార్డు సైతం దక్కడం గొప్ప విశేషం. అయితే, సుహాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Suhas : హాస్య బ్రహ్మ ఆశీర్వాదం..!
మన టాలీవుడ్ హాస్య బ్రహ్మ అయిన బ్రహ్మానందంతో కలిసి ఉన్న పిక్‌ని సుహాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో తనకి బ్రహ్మానందం ఆశీస్సులు అందించినట్టుగా ఓ కార్డుపై రాసిన పిక్‌ను కూడా జతచేశాడు. ఈ కార్డులో బ్రహ్మానందం ‘‘సుహాస్‌కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.. శుభమస్తు” అని రాశారు. ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లంతా ఈ పిక్‌ను చూసి తెగ సంతోష పడుతున్నారు. ఈ సందర్భంగా సుహాస్ సైతం ఆనందం వ్యక్తం చేశాడు.