టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని తరువాత కనుమరుగైన దర్శకులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి జాబితాలో శ్రీనువైట్ల కూడా చేరుతాడు. వరుసగా సక్సెస్ లతో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శ్రీనువైట్ల రామ్ చరణ్ తో తెరకెక్కించిన బ్రూస్ లీ, మహేష్ బాబుతో ఆగడు, రవితేజతో అమర్ అక్బర్ అంటోనీ సినిమాలతో వరుసగా మూడు భారీ డిజాస్టర్స్ కొట్టి ఒక్కసారిగా లూప్ లోకి వెళ్ళిపోయాడు. ఇక శ్రీనువైట్ల సినిమా అంటే కచ్చితంగా కోన వెంకట్, గోపి మోహన్ కూడా ఉండేవారు. ఈ ముగ్గురు కలిసి తెరపై ఎంటర్టైన్ మెంట్ ని సృష్టించారు. అయితే ఎప్పుడైతే శ్రీనువైట్ల సినిమా క్రెడిట్ మొత్తం కోన వెంకట్, గోపి మోహన్ కి ఇవ్వకుండా తాను తీసుకోవడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి వీరు ముగ్గురు దూరం అవుతూ వచ్చారు.
అలాగే వీరి కథల గమనం అంతా ఒకే తీరుగా ఉండటంతో ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది. కొత్తగా ట్రై చేసిన సినిమా ఒక్కటంటే ఒకటి కూడా లేదు ఒకే ఫార్ములాతో గోపి మోహన్, కోన వెంకట్ కథలని సిద్ధం చేసి జనాలని మీదకి వదిలారు. ఈకారణంగా ఈ కాంబినేషన్ తరువాత ఫ్లాప్ అయ్యింది. వారిద్దరూ దూరం అయిన తర్వాత కూడా శ్రీనువైట్ల తనకి అలవాటైన ఫార్ములా స్టోరీ వదలకుండా చేసి ఫ్లాప్ కొట్టాడు. ఇక ఆ మధ్య మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మూవీ ఎందుకనో పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చేయడానికి శ్రీనువైట్ల రెడీ అయినట్లు తెలుస్తుంది.
ఈ సారి ఫార్ములా చేంజ్ చేసి యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఒక కథని గోపీచంద్ కి చెప్పి ఒప్పించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా కోసం మళ్ళీ కోన వెంకట్,గోపిమోహన్ తో శ్రీనువైట్ల కలిసి పని చేయాలని డిసైడ్ అయినట్లు బోగట్టా. ఇక ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా కోన వెంకట్ చూసుకోవడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఒకే సారి ఎదిగి మళ్ళీ కనుమరుగైన ఈ ముగ్గురు స్నేహితులు మళ్ళీ కలిసి ప్రూవ్ చేసుకోవాలనే లక్ష్యంతో గోపించంద్ సినిమాని ఎంచుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. మరి ఇది వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది.