Sri Lanka vs Afghanistan: ఓ వైపు సిరీస్ ఆడుతూనే ముగ్గురు స్టార్ క్రికెటర్లు ఒకే రోజు వివాహం చేసుకున్నారు. ఆ స్టార్ క్రికెటర్లు మరెవరో కాదు.. శ్రీలంక యువ ఆటగాళ్లు చరిత్ అసలంక, కసున్ రజిత, పాతుమ్ నిసాంక. అఫ్గనిస్తాన్‌తో శ్రీలంక ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రోజు మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలైంది. ఇక రెండో వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. అయితే ఈ రెండో వన్డేలో నిసాంక, రజిత, అసలంకలు మ్యాచ్ ఆడారు.
ఇక రెండో వన్డే అయిన మరుసటి రోజే ఈ ముగ్గురూ తమ ప్రియురాళ్లను వివాహమాడారు. రేపు అంటే బుధవారం లంక వర్సెస్ అఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఈ ముగ్గురూ ఆడే అవకాశం ఉంది. ఆదివారం గేమ్ ఆడి సోమవారం ఈ ముగ్గురూ ఒకే రోజు పెళ్లిపీటలెక్కి అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ముగ్గురూ కొలంబోలోనే చేసుకున్నారు కానీ వేదికలే సెపరేటు. శ్రీలంక క్రికెట్ బోర్డు వీరి వివాహ విషయాన్ని శుభాకాంక్షలు తెలియజేసి మరీ ధృవీకరించింది.
ప్రస్తుతం శ్రీలంకలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు. ఆర్థిక సంక్షోభంలో లంక కూరుకుపోయింది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ముగ్గురు యువ క్రికెటర్లు ఎలాంటి ఆర్భాటాల జోలికీ వెళ్లకుండా తమ వివాహాన్ని సింపుల్‌గా కానిచ్చేసినట్టు తెలుస్తోంది. బుధవారం నాటి ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి సిరీస్ సమం చేయాలని దసున్ షనక సేన భావిస్తోంది. పల్లెకెలోలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ యువ క్రికెటర్ల వివాహ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.