Sleeping Tips: చాలా మందికి నిద్రలేమి సమస్య వేధిస్తూ వెంటాడుతుంటుంది. రాత్రి పడుకొనే సరికి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. దీంతో సెల్ ఫోన్ వైపు చూస్తూ సమయం వృథా చేసుకుంటూ ఉంటారు. దీనికి తోడు కుటుంబంలోని బరువు బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, పిల్లల చదువు సంధ్యలు, ఆఫీసుల్లో సమస్యలు, వ్యాపారాల్లో ఒడిదొడుకులు.. ఇలా ఒకటేమిటి.. అనేక సమస్యలతో సతమతం అవుతూ సమయానికి నిద్రపోని వారు కోకొల్లలుగా ఉంటారు. ఇలా నిద్ర తక్కువయ్యే వారికి కళ్ల కింద నల్లగా తయారవుతుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
జీవితంలో ఎన్ని రకాల ఒత్తిడులు ఉన్నా సరిపడా నిద్ర కూడా చాలా అవసరం. ఆరోగ్యకర జీవితానికి కంటినిండి కునుకు తీయడం మస్ట్. రాత్రిపూట భోజనానికి ముందు ఆల్కహాల్ సేవించడం చాలా మందికి అలవాటుగా మారి ఉంటుంది. అయితే, ప్రశాంతమైన నిద్ర రావాలంటే మద్యానికి దూరంగా ఉండాల్సిందేనంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదయం పూట వ్యాయామం చేస్తే కండరాలన్నీ కదిలి శరీరం అలసిపోతుంది. రాత్రి పూట నిద్ర రావడానికి సహకరిస్తుంది. కెఫెన్ కలిగిన పదార్థాలను కూడారాత్రి పూట తీసుకోరాదు. అంటే టీ, కాఫీ లాంటివి అస్సలు తీసుకోరాదట. ఇవి మోతాదుకు మించి, వేళ కాని వేళలో తీసుకోవడం వల్ల నిద్రకు డ్యామేజీ ఏర్పడుతుంది. రాత్రి పూట అతిగా కొవ్వు ఉన్న పదార్థాలు కూడా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొవ్వులు నిద్రపై ప్రభావం చూపుతాయి.
Sleeping Tips: మొబైల్ పక్కన పెట్టేయాలి..
రాత్రి పూట నిద్ర త్వరగా రావాలంటే మొబైల్ అస్సలు ముట్టరాదు. ఇందులోని బ్లూ లైట్ కళ్లకు హాని చేస్తుంది. చీకట్లో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. అల్లం, తులసి, కుంకుమ పువ్వు లాంటి పదార్థాలతో టీ చేసుకొని తాగితే మంచి నిద్రకు ఉపకరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుముఖం పడతాయి.