ఇండియన్ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్యకాలంలో చాలా మంది నటులు హాలీవుడ్ లో మెరుస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్స్ లలో ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ నటిగా తన ఇమేజ్ ని పెంచుకునే పనిలో ఉంది. అలాగే దీపికా పదుకునే కూడా అడుగుపెట్టింది. అలాగే టబుతో పాటు చాలా మంది తారలు హాలీవుడ్ లో మెరుస్తున్నారు. ఇక సౌత్ నుంచి అయితే ధనుష్ ఇప్పటికే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఒక సినిమా చేశాడు. ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతుంది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ధ్రువీకరించింది.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చిందని, తన కల నిజం కాబోతుంది అంటూ హాలీవుడ్ సినిమా ఎంట్రీ గురించి కన్ఫర్మ్ చేసింది. ది ఐ అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో ఆమెకి జోడీగా హాలీవుడ్ యాక్టర్ మార్క్ రౌలీ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ, చిరంజీవిలకి జోడీగా ఓ వైపు నటిస్తుంది. అలాగే సలార్ సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేయబోతుంది.
ఇప్పటి వరకు ఇండియా నుంచి హాలీవుడ్ లో నటించిన హీరోయిన్స్ జాబితా చూసుకుంటే ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, టబు, మల్లికా శరావత్, దిశా పటాని, ఐశ్వర్య రాయ్, శ్రియ శరన్, షబానా అజ్మీ ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి శృతి హాసన్ చేరబోతోంది. ఇక సమంత కూడా త్వరలో ఓ హాలీవుడ్ మూవీలో నటించబోతుంది. వచ్చే ఏడాది ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెరుగుతున్న నేపధ్యంలో భవిష్యత్తులో చాలా మంది హాలీవుడ్ నటులని ఇండియన్ సినిమాలలో అలాగే ఇండియన్ నటులని హాలీవుడ్ సినిమాలలో కచ్చితంగా చూడొచ్చు.