Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరన్న విషయం తెలిసిందే. నేటి తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. అసలు సూపర్ స్టార్ కృష్ణ ఆసుపత్రికి చేరే సమయానికి ఎలా ఉన్నారు? అసలు ఆయనకు ఏం జరిగిందనే విషయాలను కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు గురు ఎన్.రెడ్డి మీడియాకు వెల్లడించారు. నిజానికి కృష్ణ మృతిపై గురు ఎన్.రెడ్డి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ఉదయం 4 గంటలకు కృష్ణ మరణించారని డాక్టర్ గురు ఎన్.రెడ్డి తెలిపారు. ఆస్పత్రిలో చేరే సమయానికే కృష్ణ పరిస్థితి విషమంగా ఉందన్నారు. రాత్రి 7 గంటలకు కృష్ణ పరిస్థితి మరింత విషమించిందన్నారు. ఈ క్రమంలోనే కృష్ణకు మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ కూడా జరిగిందన్నారు. అందువల్లే మిగతా అవయవాలు పని చేయకుండా పోయాయన్నారు. కనీసం ఆయన శరీరం చికిత్సకు స్పందించలేదని వైద్యులు వెల్లడించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కృష్ణ మృతి చెందారని వెల్లడించారు.
కాగా.. కృష్ణ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేశామన్నారు. చివరి క్షణాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నామన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్టీవ దేహాన్ని ఉంచనున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మాదాపూర్ డీసీపీ గచ్చిబౌలి స్టేడియాన్ని పరిశీలించారు. ఈ రోజు సాయంత్రం గచ్చిబౌలి స్టేడియానికి కృష్ణ పార్టీవదేహాన్ని తరలించే అవకాశం ఉంది.