యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టి తెలుగులో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన కూతురు ఐశ్వర్య అర్జున్ ని హీరోయిన్ గా తెలుగులో ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిచయం చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోగా ముందు విశ్వక్ సేన్ ని ఖరారు చేశారు. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు విశ్వక్ సేన్ ఏవో కారణాలు చూపించి ఆలస్యం చేయడంతో అర్జున్ మీడియా ముందుకి వచ్చి అతని మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వంద కోట్లు ఇస్తామన్నా కూడా మళ్ళీ విశ్వక్ తో తాను సినిమా చేయనని తేల్చేశారు. అంతకంటే బెస్ట్ హీరోగా ఫైనల్ చేసి త్వరలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానని కూడా చెప్పారు.
ఈ నేపధ్యంలో వీలైనంత వేగంగా తన ప్రాజెక్ట్ కి సంబందించి ఓ యంగ్ హీరో ని ఫైనల్ చేసే పనిలో అర్జున్ ఉన్నారు. టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ ని తన మూవీలో హీరోగా తీసుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ వేరే సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ నేపధ్యంలో నెల రోజుల పాటు బల్క్ డేట్స్ ని అర్జున్ సినిమా కోసం శర్వానంద్ కేటాయించడానికి సిద్ధంగా లేడనే మాట వినిపిస్తుంది.
శర్వానంద్ కి కథ చెప్పి అతను ఒకే అంటే మరో రెండు నెలలు వెయిట్ చేయడానికి సిద్ధం గా అర్జున్ ఉన్నట్లు టాక్. ఒక వేళ అతను కాదంటే వేరొక యంగ్ హీరోని ట్రై చేయాలని అనుకుంటున్నారు. అసలే ఇగో సమస్యతో విశ్వక్ ని సినిమా నుంచి తప్పించారు కాబట్టి వీలైనంత వేగంగా కొత్త హీరోని ఫైనల్ చేసుకొని సినిమా స్టార్ట్ చేయాలని అర్జున్ భావిస్తున్నారు . అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.