Biggboss 6 : బిగ్ బాస్ ఇంట్లో రెండో వీకెండ్ దద్దరిల్లిపోయింది. వారంలో ఎవరెవరు ఎలా ఆటలు ఆడారు.. ప్లస్‌లు.. మైనస్‌లు.. తప్పులు.. ఒప్పుల లెక్క తేల్చి హోస్ట్ నాగార్జున మంటలు మండించారు. ఎవరు ఎలాంటి కేర్ లెస్ మాటలు మాట్లాడారో అన్నీ గుర్తు పెట్టుకుని మరీ తిరిగి ఇచ్చేశారు. మొత్తంగా ఈ శనివారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లందరికీ తడిసిపోయేలా వార్నింగ్‌లు ఇచ్చాడు నాగార్జున. చాలా దారుణంగా అవమానించేసినట్టు అనిపించినా కూడా.. గత వారం కూడా లైట్‌గా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే అంతకు మించి కంటెస్టెంట్స్ లైట్ తీసుకున్నారు. ఇక తప్పదు అనుకున్నారో ఏమో కానీ ఇచ్చేపడేశారంతే..
ఆ మాత్రం పడితేగానీ సెట్ అయ్యేలా లేరని అనుకుందో ఏమో గానీ బిగ్ బాస్ టీం మాత్రం అందరికీ గట్టిగానే తలంటు పోయించేసింది. నాగార్జున కూడా మాంచి ఫైర్ మీద కనిపించారు. అభినయ.. సెకండ్ ఇన్నింగ్స్ ఇంత డల్లుగానా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీప.. ఇల్లంటే కిచెన్ కాదు అంటూ కౌంటర్లు వేశారు. షానీ.. బిగ్ బాస్ ఇంట్లో అవకాశం అంటే.. వేల మంది ప్రయత్నిస్తే.. కొంత మందికే దక్కుతుంది. వాళ్లలో నువ్వు ఒకడివి.. తినడానికి పడుకోవడానికి వచ్చాను.. అంటే వెళ్లిపో.. మాకొద్దు.. ఇకనైనా ఆడకపోతే.. ఉండి వేస్ట్.. మా టైం వేస్ట్.. అని మొహమాటం లేకుండా చెప్పేశారు.
Biggboss 6 : జర్నీ వీడియోను చూపించలేదు. ఇంటి సభ్యులతో మాట్లాడించలేదు..
తొమ్మిది మంది వేస్ట్ అని చెప్పి మిగిలిన పదకొండు మందితో ఎవరు వేస్ట్ అన్నదానిపై ఓటింగ్ వేయించారు నాగ్. అందులో శ్రీ సత్య, వాసంతి, షానీలకు మూడు మూడు ఓట్లు పడ్డాయి. ఇక ఇంటి సభ్యుల ఓటింగ్, ఆడియెన్స్ ఓటింగ్‌లతో మ్యాచ్ అయిందని షానీని ఎలిమినేట్ చేశారు. అయితే ఇది రెగ్యులర్ ఎలిమినేషన్‌లా జరగలేదు. స్టేజ్ మీదకు వచ్చాక జర్నీ వీడియోను చూపించలేదు. ఇంటి సభ్యులతో మాట్లాడించలేదు. ఓ టాస్క్ అంటూ పట్టలేదు. తూతూ మంత్రంగా కానిచ్చేశారు. మొత్తానికి ఇదేదో ఫేక్ ఎలిమినేషన్‌లా అనిపించింది. ఆ తరువాత ఒకే ఒక జీవితం ప్రమోషన్స్‌లో భాగంగా అమల, శర్వానంద్ బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు.