Naga Chaitanya : ఈ టాటూలున్నాయే వీటితో ఒక తంటా కాదు.. ఆవేశంగా.. ఆనందంగా వేయించేసుకుంటాం. తరువాత పరిస్థితులు ఎలా మారతాయో తెలీదు. ఆ టాటూ ఎవరి పేరైతే వేయించుకుంటామో ఆ వ్యక్తి మన జీవితంలో ఉంటుందో వెళ్లిపోతుందో తెలీదు. ఉంటే ఓకే.. కానీ వెళ్లిపోతేనే వస్తుంది తంటా. అది తీయించడం వేయించుకున్నంత సులభం కాదు. ఇప్పుడు హీరో నాగ చైతన్య విషయంలోనూ అదే జరిగింది.
సమంత-నాగచైతన్య జంటకు ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరుంది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తామిద్దరం భార్యభర్తలుగా విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన చేసి ఏడాది కావొస్తోంది.. ఎవరి పనుల్లో వారు బిజీ.. ఎవరి జీవితం వారిది. అయినా కూడా ఇంకా వీరి బ్రేకప్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గానే ఉంది. వారిద్దరూ ఒకరి ఊసు మరొకరికి లేకుండా పనులు చేసుకుంటూ పోతున్నారు. అయినా కూడా వీరిద్దరికీ సంబంధించి ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా లాల్ సింగ్ చద్దా అనే మూవీ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. సినిమా ఆగస్ట్ 11న అంటే రేపు విడుదల కానుంది.
Naga Chaitanya : నా టాటూని ఫ్యాన్స్ ఎవరూ కాపీ కొట్టకండి..
దీంతో మన యంగ్ హీరో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలలో ప్రతి ఒక్కదానిలో మనోడికి సమంతకు సంబంధించి ప్రశ్న ఒకటి తప్పకుండా ఎదురవుతోంది. ఇక ఒక ఇంటర్వ్యూలో చై తన చేతిపై ఉన్న టాటూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా టాటూని ఫ్యాన్స్ ఎవరూ కాపీ కొట్టకండి. ఎందుకంటే ఇది సమంతతో నా పెళ్లిరోజు తేదీని మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నా. కీలకమైన విషయాలని టాటూగా వేయించుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంటుంది’ అని తెలిపాడు. అయితే ఇప్పుడు ఆ టాటూని తొలగించాలని ఎప్పుడైనా అనుకున్నారా అని యాంకర్ ప్రశ్నించింది. ఎప్పడూ దాని గురించి ఆలోచించలేదని… టాటూ మార్చడానికి ఏమీ లేదని చెప్పాడు. ఇప్పుడు చై టాటూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.