Sania-Shoiab : ఇటీవలి కాలంలో సెలబ్రిటీల జంటలు విడిపోవడం తరచుగా వింటున్నాం. కొంత కాలం క్రితం వరకూ ఎక్కువగా ప్రేమ జంటలే బ్రేకప్ చెప్పుకుని విడిపోయిన వార్తలు చూశాం. ఇప్పుడు తరచుగా పెళ్లైన జంటలు సైతం విడాకులు తీసుకుంటున్నాయి. తరచుగా సినీ సెలబ్రిటీల గురించే ఎక్కువగా ఈ వార్తలు వింటూ వస్తున్నాం. ఈ క్రమంలోనే తాజాగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ జంట విడిపోనున్నారన్న వార్తలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్టు సమాచారం.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లు కొంతకాలం ప్రేమలో ఉన్న తర్వాత 2010లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. 2018లో వీరికి ఒక బాబు జన్మించాడు. అయితే వివాహానంతరం వీరిద్దరూ తమ స్వదేశాలైన పాకిస్తాన్, ఇండియాలో కాకుండా దుబాయ్‌లో ఉంటున్నారు. కాగా.. తాజాగా ఈ జంట విడిపోబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల షోయబ్‌ను ఓ టీవీ షోలో భాగంగా ఒక అభిమాని.. సానియా నిర్వహించే అకాడమీల గురించి అడిగాడు. దీనికి షోయబ్.. ఆమె అకాడమీల గురించి తనకు పెద్దగా తెలియదని సమాధానం చెప్పి షాకిచ్చాడు.
ఇక తాజాగా సానియా సైతం తన ఇన్‌స్టాలో చేసిన ఒక పోస్ట్ కూడా ఈ జంట విడిపోతున్నారన్న వార్తలకు బలం చేకూర్చింది. బద్దలైన హృదయం.. అల్లాను వెదుక్కుంటూ వెళుతుందని సానియా పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ తమ విడాకుల గురించే పరోక్షంగా సానియా పెట్టిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే వీరిద్దరూ విడిపోతున్నారనడానికి కొత్త చర్చ కూడా తెరపైకి వచ్చింది. షోయబ్‌కు ఒక మోడల్‌తో ఉన్న బంధంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. పాక్‌కు చెందిన ఓ మోడల్‌తో షోయబ్ హాట్ ఫోటో షూట్ నిర్వహించారు. ఈ ఫోటో షూటే వారిద్దరి సంసారంలో నిప్పులు పోసిందనే చర్చ జోరుగా నడుస్తోంది.