దేశంలో చాలా ప్రాంతాలలో గణపతి ఆలయాలు ఉన్నాయి. కొన్ని స్వయంభుగా వెలసినవి ఉండగా, మరికొన్ని దశాబ్దాల చరిత్రతో రాజులు, కొంత మంది భక్తులు నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే చారిత్రాత్మక నేపధ్యం ఉంటుంది. హిందువుల విశ్వాసం కూడా ఉంటుంది. భారతీయ సనాతన నాగరికత, ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు మైథలాజీ కలిసి ఉన్న చారిత్రాత్మక నేపధ్యాన్ని విశ్వసిస్తూ ఉంటారు. ఏపీలో కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి ఎంత చరిత్ర ఉందో అంతే చరిత్ర విశాఖ సిటీలో ఉన్న సంపత్ వినాయకుడికి కూడా ఉంది. 1962లో ద్వారకానగర్ నుంచి సిరిపురం వెళ్లే ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఇప్పటికి రోడ్డుకి ఆనుకొని సంపత్ వినాయక ఆలయం ఉంటుంది. చూడటానికి ఆలయం చాలా చిన్నదిగా ఉన్నా దీని ప్రత్యేకత మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. టి.ఎస్.రాజేశ్వరన్ అనే ఒక వ్యాపారి ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఏపీ దేవాదాయ శాఖ పరిధిలో ఈ ఆలయం నిర్వహణ ఉంది. దీనికి చారిత్రాత్మక నేపధ్యం కూడా ఉంది. ఇండో-పాకిస్థాన్ యుద్ధం సమయంలో పాకిస్థాన్ విశాఖ నగరం మీద బాంబు దాడి చేయాలని భావించింది. దానికి పెద్ద స్కెచ్ వేసింది. అయితే భారత నావికాదళం ఆ దాడిని భగ్నం చేశారు. అయితే పాకిస్థాన్ బాంబు దాడి నుంచి సంపత్ వినాయక స్వామినగరాన్ని రక్షించారని అక్కడి ప్రజల విశ్వాసం.
అలాగే విశాఖ సిటీలో ఎవరు కొత్త వాహనం కొనుగోలు చేసిన ముందుగా సంపత్ వినాయక ఆలయానికి తీసుకొని వెళ్లి పూజలు నిర్వహించి తరువాత వాహనాన్ని ప్రారంభిస్తారు. దీనికి కారణం కూడా ఉంది. సంపత్ వినాయక ఆలయంలో వాహనానికి పూజలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు సంభవించవని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే కొత్త వాహనం ఏదైనా ముందుగా సంపత్ వినాయక ఆలయానికి వచ్చి పూజలు జరుపుకొంటుంది. అలాగే సంపత్ వినాయకుడు సైక్లోన్, సునామి ప్రమాదాల నుంచి నగరాన్ని కాపాడుతున్నారని అందరూ భావిస్తారు. అలాగే విశాఖ నగరాభివృద్ధికి కూడా సంపత్ వినాయకుడి దీవెనలు కారణం అని కూడా భావిస్తూ ఉంటారు. ఇంత ప్రాశస్త్యం ఉంది కాబట్టి ఏపీలో విశాఖ సంపత్ వినాయగర్ టెంపుల్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది.