Samantha : స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం షూటింగ్‌లన్నీ పక్కనబెట్టేసి మయోసైటిస్‌కు చికిత్స పొందుతోంది. నిజానికి ఇదొక ప్రాణాంతక వ్యాధి అని.. దీనికి వైద్యం కూడా లేదని సమంతే స్వయంగా వెల్లడించింది. అప్పుడప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తోందని ఓ ఇంటర్వ్యూలో సామ్ కన్నీరు పెట్టుకుంది. ఆమె సంపూర్ణంగా కోలుకోవాలంటూ ఆకాంక్షించని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
సామ్ తన వ్యాధి నుంచి బయట పడేందుకు చాలా విధాలుగా యత్నిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాలో సైతం మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంది. అయితే ఆ వైద్యం వల్ల పూర్తిగా అయితే కోలుకునే అవకాశం లేదని పలువురు ఆమెకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సామ్ కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి కేరళ వైద్యం చాలా రోగాలను నయం చేస్తుందనే టాక్ బలంగానే ఉంది. సామ్‌కు కూడా ఈ చికిత్స మంచి రిజల్ట్‌నే ఇస్తోందట. ఈ క్రమంలోనే సామ్ త్వరలోనే కోలుకోవచ్చనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.
కేరళ వైద్యంలో సామ్ త్వరలోనే కోలుకుని.. ఆ వెంటనే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సమంత సన్నిహితుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషీ చిత్రం షూటింగ్‌లో సామ్ పాల్గొనాల్సి ఉంది. కానీ ఆమె అనారోగ్యం కారణంగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే సామ్ కోలుకుని తిరిగి ఖుషి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటుందనే ఆశాభావాన్ని చిత్ర యూనిట్ వ్యక్తపరుస్తోంది. ఇప్పటికే సామ్ నటించిన యశోద చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.