సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా సమంత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని ఇప్పుడు బాలీవుడ్ లో జెండా పాతేయడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో క్రేజ్ పరంగా అందనంత ఎత్తులకు వెళ్లిన సమంత చేతిలో తెలుగులో ప్రస్తుతం మూడు సినిమాలు ఉండగా అందులో రెండు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. సోలో హీరోయిన్ గా ఇండియన్ వైడ్ గా పాన్ ఇండియా ఇమేజ్ ని సమంత ఈ సినిమాలతో సొంతం చేసుకోబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో వైపు బాలీవుడ్ లో కూడా ఆయుష్మాన్ ఖురానాతో ఒక సినిమాకి కమిట్ అయ్యింది. అలాగే అక్షయ్ కుమార్ తో ఒక సినిమాలో నటిస్తుంది.
మరో వైపు వెబ్ సిరీస్ కూడా హిందీలో రెడీ అవుతుంది. దీనికోసం ఏకంగా మార్షల్ ఆర్ట్స్ ని సమంత నేర్చుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ మూవీలో సమంత నటించబోతుంది అనే విషయం చాలా ఆసక్తిగా మారింది. ఇండియన్ హాలీవుడ్ మూవీగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే టైటిల్ తో ఈ హాలీవుడ్ మూవీ తెరకెక్కనుంది. ఫిలిప్ జాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సునీత తాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ ఏడాది క్రితమే అఫీషియల్ గా ఎనౌన్స్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు.
కరోనా ప్రభావం ఒకటి అలాగే శాకుంతలం, యశోద సినిమాల కారణంగా ఆ సినిమాకి సమంత డేట్స్ కేటాయించలేకపోయింది. అయితే తాజాగా ఈ హాలీవుడ్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది వేసవిలో స్టార్ట్ అవుతుందని నిర్మాత సునీత తాటి శాకినీ డాకిని సినిమా ప్రమోషన్ లో చెప్పింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో డిటెక్టివ్ ఏజెన్సీ నడిపించే తమిళ్ అమ్మాయి పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పాత్ర బట్టి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరినీ ప్రేమించే యువతిగా నటించనుంది. హాలీవుడ్ లో నటిస్తున్న మొదటి సౌత్ ఇండియన్ నటిగా సమంత ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పాలి.