Roja: ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న వైసీపీ నేత, మంత్రి రోజాకు వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. నగరి నుండి అసెంబ్లీ సెగ్మెంట్ లో బరిలో ఉండి నాటకీయ పరిణామాల మధ్య గెలిచిన రోజా.. ఈసారి కూడా గెలుస్తుందా? లేదా? అనే చర్చ సాగుతోంది.
వైసీపీ నేతలు చాలామంది రోజాకు వ్యతిరేకంగా ఉన్నారని, పలు మీటింగ్ లలో కూడా రోజాను వాళ్లు పట్టించుకోలేదని తెలుస్తోంది. మొన్నీ మధ్యనే రోజా కూడా.. నగరిలో తనను ఓడించాలని కొంతమంది సొంత పార్టీ నేతలే కుట్ర పన్నుతున్నారని, ఇలా అయితే రాజకీయాలు చేయడం కష్టమే అని కామెంట్ చేయడం తెలిసిందే.
నగరి నియోజకవర్గం నుండి రోజా వరుసగా 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ హవా ఉన్నా, జగన్ చరిష్మా ఉన్నా కేవలం మూడు వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు. అయితే వరుసగా గెలిచిన రోజాకు ఈసారి వ్యతిరేకత ఉండటం సాధారణం. దీనికితోడుగా పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉండటం రోజాకు మైనస్ గా మారుతుంది.
ఇక సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎంతో కీలకం. అయితే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న 16 గ్రామాలకు తోడు మిగిలిన గ్రామాల్లో వైసీపీకి అనుకూలత రోజాకు కలిసి వస్తుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 15 గ్రామాల్లో ఎక్కువగా ఉంటే, 13 గ్రామాల్లో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. ఈ గ్రామాల్లో వైసీపీ వ్యతిరేకత చవిచూడాల్సి ఉంటుంది.
Roja:
ఇవన్నీ ఒక ఎత్తు అయితే రోజాను ధీటుగా ఎదుర్కొనే ప్రత్యర్థి పార్టీ బలం లేకపోవడం ఖచ్చితంగా రోజాకు కలిసి వచ్చే అంశం. రోజా మీద పోటీగా టీడీపీ నుండి భానుప్రకాష్ ను దించే అవకాశాలు ఉండగా.. ఆయనకు రాజకీయ వ్యూహాలు పెద్దగా తెలియదని తెలుస్తోంది. అలాగే దూకుడగా ఉండరని, అందరినీ కలుపుకొని పోయే తత్వం లేదని, సొంత తమ్ముడు తనకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఖచ్చితంగా భాను ప్రకాష్ కు మైనస్ గా మారనుండగా.. ఇవి రోజాకు కలిసి వచ్చే అంశాలుగా మారతాయి.