Rishabh Pant: కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియా టూర్ టెస్టు క్రికెట్లో, విదేశ పర్యటనల్లో తన దూకుడు ప్రదర్శనతో అదరగొట్టిన రిషబ్ పంత్ ఇప్పుడు మాత్రం ఏ మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయడం లేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. దీంతో పలువురు మాజీ ఆటగాళ్ళు వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్ లో 66 మ్యాచులు ఆడిన పంత్ 22.43 సగటుతో 987 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్ లాంటి యువ ఆటగాళ్ళు జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. వన్డేల్లో 10 మ్యాచుల్లో 73 సగటుతో 294 పరుగులు చేశాడు. దీంతో సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకోవాలని, రిషబ్ పంత్ ను జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.
రిషబ్ పంత్ కన్నా సంజూ శాంసన్ చాలా బెటర్..!
తాజాగా రిషబ్ పంత్ పై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఈ రెండు మ్యాచుల్లో రిషబ్ పంత్ చాలా పేలవంగా ఆడాడు. ఇప్పుడు మరోసారి పాతపడిపోయిన అదే ప్రశ్నను తవ్వి తీయాల్సి వస్తోంది. అతను ఓపెనరా? లేక మీరే పంత్‌ను ఓపెనర్‌గా మార్చాలని అనుకుంటున్నారా?’ అని చోప్రా ప్రశ్నించాడు. అసలు టీమిండియాలో పంత్ కు స్థానం ఉందా? జట్టులో అతను అవసరమా? అని అడిగాడు. ఇంత సత్తా ఉన్న ఆటగాడు వేస్ట్ అవకూడదని ఓపెనర్‌గా ఆడిస్తున్నారా? అని ప్రశ్నించాడు.
Rishabh Pant:
ఈ టీంలో అతన్ని వైస్ కెప్టెన్ చేశారు. అంటే అతను అన్ని మ్యాచుల్లో ఆడాలనేది ప్లాన్. కానీ అతను ఆడితే ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి? రిషబ్ పంత్ లో బెస్ట్ ఎలా బయటకు తీసుకురావాలనేదే టీం మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల ముందు ఉన్న అతి పెద్ద సవాల్’ అని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ తో ఆడిన 2 మ్యాచుల్లో ఓపెనర్ గా వచ్చిన రిషబ్ పంత్ 2వ మ్యాచులో 13 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మూడో టీ20లో 5 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ రెండు మ్యాచుల్లో ఒకే తరహా బంతికి పంత్ వికెట్ పారేసుకున్న విషయం మనందరికి తెలిసిందే.