సర్వ విఘ్నాలని తొలగించే విఘ్ననాయకుడు వినాయకుడు. అందుకే హిందువులలో తొలి ఆరాధ్యుడిగా ప్రతి ఒక్కరు అతన్ని ఆరాధిస్తూ ఉంటారు. విఘ్నవినాయక అనే పేరు కూడా ఉండటానికి కారణం అదే. ఇండియాలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. వేలాది సంఖ్యలో వినాయక మండపాలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వెలుస్తాయి. తొమ్మిది రోజుల పాటు నిష్ఠతో వినాయక నవరాత్రి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక కొంత మంది అయితే అత్యంత ఎత్తైన గణేశుడి విగ్రహాలని ప్రతిష్టించి పూజాదికాలు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులని ఆకర్షించడం కోసం ఇలాంటి ఎత్తైన వినాయకుడి విగ్రహాలని ప్రతిష్టిస్తారు.
అలాగే కొన్ని చోట్ల ప్రత్యేక రూపాలలో, అలాగే వివిధ రకాల వాస్తు, పదార్ధాలతో వినాయక ప్రతిమలు చేసి ప్రతిష్టించి పూజలు చేస్తారు. అయితే ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఖైరతాబాద్ గణేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేకత ఉండే విధంగా అక్కడి భక్తులు వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. అలాగే ముంబైలో కూడా గణేష్ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. ఈ సారి అత్యంత ఖరీదైన వినాయకుడుని ముంబైలో ప్రతిష్టించబోతున్నారు. ముంబైలో ఓ గణేష్ మండపానికి ఏకంగా 316కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించారు నిర్వాహకులు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముంబై కింగ్స్ సర్కిల్‌లోని జీఎస్‌బీ సేవా మండల్ ఏర్పాటుచేసిన మండపం ముంబైలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది.
దాంతో, మండపానికి 316కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించారు. ఈ మండపంలో ఉన్న ఆభరణాల నుంచి, వస్తువుల వరకు, అలాగే మండపం నిర్వాహకుల నుంచి భక్తుల వరకు అన్నింటికీ ఇన్సూరెన్స్ చేయించారు. మండపంలో ఏవైనా వస్తువులు ప్రకృతి వైపరీత్యాల వలన నాశనం అయితే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అలాగే మండపంలో ఏదైనా ప్రమాదం కారణంగా నిర్వాహకులు, భక్తులు చనిపోయిన, గాయాల పాలైన ఇన్సూరెన్స్ వర్తించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఏటా వినాయక మండపానికి ఇన్సూరెన్స్ చేయిస్తామని, ఈ సారి భక్తులకి కూడా ఇన్సూరెన్స్ వర్తించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. వినాయకచవితి మొదలైన రోజు నుంచి పదిరోజులపాటు ఈ ఇన్సూరెన్స్ ఉంటుందన్నారు.