ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ గా మారిన వివాదానికి పుల్ స్టాప్ పడినట్టేనా..? సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నేరుగా ఏపీ మంత్రి పేర్ని నాని ని కలవడంతో సమస్యలకు పరిష్కారం దొరికే పరిస్థితి ఉందా..? ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య ఉన్న గ్యాప్ తగ్గించే దిశగా ఓ అడుగు అయితే ముందుకు పడింది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం చేసిన వర్మ.. ఆ వార్ కు బ్రేకులు వేశారు.. ఇవాళ నేరుగా మంత్రి పేర్ని నానితో సినిమా పరిశ్రమ ఎదుర్కంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలెవరికీ లభించిన అవకాశం.. ఇండస్ట్రీతో సంబంధం లేదని చెప్పే వర్మకి లభించింది. సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్న వర్మకి హై సెక్యురిటీ కల్పించింది ఏపీ ప్రభుత్వం.. పోలీసు అధికారుల భద్రతతో అమరావతి సచివాలయానికి చేరుకున్నారు వర్మ. అయితే వర్మ ఎయిర్ పోర్ట్‌కి చేరుకోవడంతో అతని అభిమానులు.. మీడియా హంగామా అక్కడ కనిపించింది.
అయితే ఈ భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన వర్మ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం చెప్తున్నదానికి మేం మాట్లాడేదానికి చిన్న చిన్న మిస్ అడర్ స్టాండింగ్స్ ఉన్నాయి.. వాటిని కూర్చుని మాట్లాకోవడానికి మాత్రమే వచ్చాను తప్పితే అంతకు మంచి ఏమీ లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదు.. నేను చెప్పిన వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందా? అంటే నేనేం చెప్పలేను. ఫైనల్ డిసిషన్ గవర్నమెంట్‌దే. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్‌గా డైరెక్టర్‌గా నా వ్యూ పాయింట్ చెప్పడానికి మాత్రమే వచ్చాను.
ఇండస్ట్రీ పెద్దల గురించి నేను మాట్లాడనుకోవడం లేదు.. నేను వచ్చింది ఇండస్ట్రీ తరుపున కాదు.. నా తరుపున వచ్చా.. ఫిల్మ్ మేకర్‌గా మాత్రమే వచ్చాను.. నాగార్జున కామెంట్‌లపై నేను స్పందించాల్సిన అవసరం లేదు.. ఆయనే కాదు.. ఎవరు మాట్లాడినా నేను స్పందించను.. నాలాగే అందరికీ నోరు ఉంటుంది.. వాళ్ల నోరు గురించి నేను మాట్లాడను’’అంటూ చెప్పుకొచ్చారు వర్మ. నేరుగా సచివాలయంలో మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయి.. వర్మ కోరిన అంశాలపై మంత్రి ఎలా స్పందించారు.. వీటన్నటికీ కాసేపటిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ల ధరలు పెంచకపోతే భారీ నష్టం తప్పదనే విషయం మంత్రికి చెప్పినట్టు సమాచారం..
గత కొన్ని రోజులు ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా పరిస్థితి కనిపించింది. ఓ వైపు కరోనా భూతం.. మరోవైపు కర్ఫ్యూ.. లాక్ డౌన్ ల కారణంగా సినిమా ఇండస్ట్రీ భారీగా నష్ట పోయింది. ఇదే సమయంలో తెలంగాణలో సినీ పరిశ్రమకు వరాలు కురిపిస్తే.. ఏపీ ప్రభుత్వం పరిస్తితి భిన్నంగా ఉందన్నది సినిమా పెద్దల వాదన.. ముఖ్యంగా పెద్ద సినిమాల సమయంలో టికెట్ల ధరలు భారీగా పెరిగిన ఆనవాయితీ వస్తూ ఉంది. ఆ వ్యవహారానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది..