ఏపీ రాజకీయాలలో వైసీపీ, టీడీపీ మధ్య అమరావతి రాజధానిపై పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇక అమరావతి ఉద్యమం అనే పెయిడ్ క్యాంపైన్ అని వైసీపీ ఆరోపిస్తూ ఉండగా. అమరావతి రైతులది రాజధాని కోసం జరుగుతున్న పోరాటంగా టీడీపీ అభివర్ణిస్తుంది. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలలో కూడా అమరావతి రైతుల మహాపాదయాత్ర మీదనే వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. ఇక టీడీపీ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణకి చెందిన కాంగ్రెస్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలబడటమే కాకుండా వైసీపీపై, అలాగే కొడాలి నానిపై గతంలో విమర్శలు చేశారు. మహిళా నేతలపై కొడాలి చేసిన కామెంట్స్ పై రేణుక చౌదరి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
ఇక రేణుక చౌదరి విమర్శలపై కొడాలి నాని కూడా స్పందించి ఆమె కార్పొరేటర్ గా కూడా గెలవలేని వ్యక్తి అని, ఆమెకి నా మీద విమర్శలు చేసే అర్హత లేదని వ్యాఖ్యలు చేశారు. ఇక కొడాలి వ్యాఖ్యలపై రేణుక చౌదరి సీరియస్ గానే స్పందించింది. తాజాగా ఓ యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడాలి నానిపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఖమ్మం ఎంపీగా గెలిచానని, కేంద్ర మంత్రిగా పని చేశానని చెప్పుకొచ్చింది. అలాగే తాను కార్పొరేటర్ గా గెలిచినప్పుడు కొండాలి నాని లారీలు కడుక్కునే వాడని వ్యంగ్యంగా అతని జీవితాన్ని గుర్తు చేసింది.
తాను గుడివాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కొడాలి నానిని ఓడిస్తానని కూడా ఛాలెంజ్ చేసింది. తాను పోటీలో దిగితే కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. అయితే తాను ఎక్కడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తరపునే బరిలోకి దిగుతానని స్పష్టం చేసింది. గుడివాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కొడాలి నానిని ఓడిస్తానని రేణుక చౌదరి అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి వాటిపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తాడనేది చూడాలి.