ఏపీలో అధికార పార్టీ వైసీపీ తాము ఎన్నికలలో కచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితో జత కట్టే ఉద్దేశ్యమే తమకి లేదని పదే పది చెబుతున్నారు. ఈ సారి ఎలాగైనా 175 స్థానాలలో కూడా తామే గెలుస్తామని జగన్ ధీమాగా చెబుతున్నారు. బయటకి డాంబికాలు పోతున్న వైసీపీ అధిష్టానం మాత్రం లోపల రాబోయే ఎన్నికలపై అంతర్మధనంలో ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. దీనికి కారణం టీడీపీ, జనసేన కలిసి మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగుతాయనే ఊహాగానాలు తెరపైకి రావడంతో ఇప్పటికే సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయానని ఇంటర్నల్ గా వినిపిస్తున్న సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రతి సభలో కచ్చితంగా వైసీపీని గద్దె దించుతానని గట్టిగా చెబుతున్నారు.
అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ మాటల్లో బలమైన నమ్మకం కనిపిస్తుంది. టీడీపీ కూడా వ్యూహాత్మకంగా వైసీపీని ఇరుకున పెడుతూ రాజకీయ కార్యాచరణతో వెళ్తుంది. ఈ నేపధ్యంలోనే జగన్ కి టెన్షన్ మొదలైందనే మాట వినిపిస్తుంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో వెనకుండి తమని నడిపించిన బీజేపీ పార్టీతో మళ్ళీ మైత్రీని జగన్ కోరుకుంటున్నారు. ఏపీలో బీజేపీ పార్టీ ఎలాగూ ఇప్పట్లో బలపడే అవకాశం లేదు కాబట్టి ఈ నేపధ్యంలో వారి మద్దతు తనకి అందిస్తే గెలవడం ఈజీ అనే భావనలో జగన్ ఉన్నారని టాక్. ఈ నేపధ్యంలోనే విభజన హామీలలో భాగంగా ఇప్పటికే చాలా నిధులు కేటాయించామని బీజేపీ సర్కార్ చెబుతున్న మళ్ళీ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా అంటూ కొత్త నాటకానికి తెరతీస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
కేంద్రమే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని తేల్చేసింది. అయితే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి జగన్ మోడీతో చర్చించారు అంటూ కథనాలని వైసీపీ సోషల్ మీడియా ప్రెజెంట్ చేస్తుంది. అయితే ఢిల్లీలో బీజేపీ పెద్దలని జగన్ కలవడం వెనుక రానున్న ఎన్నికలలో జనసేన, టీడీపీ కలిసి వెళ్తాయని వారికి చెప్పడంతో పాటు తమకి మద్దతు ఇస్తే అన్నిరకాలుగా తమ సహకారం ఉంటుందని జగన్ అమిత్ షాకి హామీ ఇచ్చారనే మాట వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఏంటనేది ఎన్నికల ముందు తెలిసే అవకాశం ఉంది.