Rayalaseema: మొత్తానికి రాయలసీమ ఉద్యమం కథ కంచికి చేరినట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడిన రాయలసీమ ఉద్యమం ప్రస్తుతం కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే..! ఇందుకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడటం ఇష్టం లేక అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నట్లు అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు.
సీట్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ నినాదంతో ఏపీలో భారీ మెజారిటీ ఎమ్మెల్యే సీట్లతో వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో అనుకోకుండా ఓ బాంబ్ పేల్చాడు. అదేంటంటే ఏపీకి మూడు రాజధానులు అంటూ ఊహించని ప్రకటన చేయడంతో అందరూ అవాక్కయ్యారు.

ఈ మూడు రాజధానుల పేరుతో కర్నూలుకు హైకోర్టు ఇచ్చి న్యాయ రాజధాని ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాయలసీమ ఉద్యమకారులు అంతా మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాయలసీమ రాష్ట్రం, రాయలసీమ నీటి వాటాలు, రాయలసీమ ప్రాజెక్టులు, రాయలసీమ వలసలు, రాయలసీమకు పరిశ్రమలు, రాయలసీమకు రైల్వేజోన్, శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలును రాజధానిగా ప్రకటించాలి ఇలా ఎన్నో డిమాండ్ లతో రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు జరిగాయి.
వైసీపీ అధికారంలోకి రాగానే అవన్నీ ఉద్యమకారులు గాలికొదిలేశారనే వాదన వినిపిస్తోంది. కేవలం వైసీపీ ప్రభుత్వం న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు హైకోర్టు ఇవ్వడంతో రాయలసీమ సమస్యలు అన్ని పరిష్కారం అయినట్లుగా రాయలసీమ వాదులు సైలెంట్ అయిపోయారు. దీంతో గతంలో రాయలసీమ ఉద్యమం పేరుతో వైసీపీనే ప్రోత్సహించి టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకువచ్చేందుకు అలా డ్రామాలు ఆడినట్లు స్పష్టంగా కనిపిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.