Ravindra Jadeja: డిసెంబర్ నెల ఆరంభం నుంచి టీమిండియా బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ తో టీమిండియా 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. అయితే పర్యటనకు ముందే టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇంతకుముందే వరల్డ్ కప్ కు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే రవీంద్ర జడేజా పూర్తిస్థాయి ఫిట్నెస్ గా లేకపోవడంతో ఈ పర్యటనకు వెళ్లకపోవచ్చని సమాచారం.
ఆసియా కప్ లో ఆడుతున్న సమయంలోనే రవీంద్ర జడేజా మోకాలికి గాయమవడంతో బౌలింగ్ చేయడం కష్టంగా మారింది. దీంతో అతను ఆసియా కప్ మధ్యలోనే జట్టు నుంచి నిష్క్రమించాడు. మోకాలికి ఆపరేషన్ చేయించుకొని, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ కారణంగానే అతను టీ20 వరల్డ్ కప్, న్యూజిల్యాండ్ పర్యటనలకు దూరంగా ఉన్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అతడు లేని లోటు స్పష్టంగా కనిపించింది.
టెస్టుల్లో కీలక ఆల్ రౌండర్ గా మారిన రవీంద్ర జడేజా..!
చాలా ఏళ్లుగా టెస్టు క్రికెట్లో రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ద్వయం తమ స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీస్తూ టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ జట్టులో ఉంటే ప్రత్యర్థి ఆటగాళ్ళకు బ్యాటింగ్ చేయాలంటే ఒత్తిడిగా భావించేవారు. కొంత కాలంగా గాయాలు వెంటాడడంతో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరమయ్యాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించేవాడు.
Ravindra Jadeja:
బంగ్లాదేశ్ పర్యటనలో రెండు టెస్టులను గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో నిలవాలని టీమిండియా ఆశిస్తుంది. గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరి న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా మరి ఈసారి కూడా ఫైనల్ కి చేరుతుందో లేదో వేచిచూడాలి. మరోవైపు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య బీజేపీ తరపున ఎన్నికలలో పోటీ చేస్తుండడంతో సోషల్ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన పోస్టులను పెడుతూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.