రమ్యకృష్ణ… ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఈ పేరు తెలియని వారు ఉండరు. ముగ్ధమనోహరమైన రూపంతో కనువిందు చేసే అందాల సుందరి, సినిమాకి గ్లామర్ నేర్పిన రమ్యమైన అందం ఆమెది. పూవులైన, పండ్లయిన ఆమె అందానికి దాసోహం అనాల్సిందే. ఇప్పుడంటే హీరోయిన్స్ ఫోటోషూట్ అంటూ గ్లామర్ గా తెరపై కనిపించడానికి తెగ ఆరాటపడుతున్నారు. కాని రెండు దశాబ్దాల క్రితమే గ్లామర్ కి కేరాఫ్ గా రమ్యకృష్ణ అందంతో అందరిని అలరించింది. తెరపై సాంగ్స్ లో రమ్యకృష్ణ అందాన్ని చూడటానికి ప్రేక్షకులు సినిమాకి వేల్లెవారంటే అతిశయోక్తి కాదు. కేవలం అలాంటి ఫాలోయింగ్ రమ్యకృష్ణకే సొంతం అని చెప్పాలి. ఎప్పుడో 1983లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రమ్యకృష్ణ ఆరంభంలో చెల్లెల్లు పాత్రలు, అలాగే ఫ్రెండ్ రోల్స్ చేస్తూ వచ్చింది. తరువాత హీరోయిన్ గా టర్న్ తీసుకొని కామెడీ చిత్రాలతో నటించింది.
కెరియర్ ఆరంభంలో చిరంజీవికి చెల్లెలుగా డాక్టర్ చక్రవర్తి అనే సినిమాలో నటించిన రమ్యకృష్ణ అదే మెగాస్టార్ కి హీరోయిన్ గా ముగ్గురు మొనగాళ్లు సినిమాలో ఆడిపాడింది. తరువాత అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు సినిమాలో జత కట్టింది టాలీవుడ్ లో నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు అందరితో జతకట్టింది. అలాగే రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, రాజశేఖర్, సుమన్ లాంటి స్టార్స్ తో కూడా ఆడిపాడింది. ఇక గ్లామర్ రోల్స్ లో రమ్యకృష్ణ ఎంతగా అందరిని మెస్మరైజ్ చేసిందో, అదే స్థాయిలో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలలో కూడా అంతే స్థాయిలో కట్టిపడేసింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె నటించిన ఆయనకి ఇద్దరు సినిమా ఆమెలో ఎంత అద్భుతమైన నటి ఉందో చూపిస్తుంది.
అలాగే కంటే కూతుర్నే కనాలి, ఆహ్వానం సినిమాలలో ఆమెలో మరో షేడ్స్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కన్నీళ్లు పెట్టించే నటనతో ఆ సినిమాలలో రమ్యకృష్ణ నటనకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయి ఆమెకి ఫాన్స్ గా మారిపోయారు. ఇక రజినీకాంత్ కి నరసింహ సినిమాలో నీలాంబరిగా పవర్ ఫుల్ విలనిజంతో మెస్మరైజ్ చేసింది. ఇక బాహుబలిలో శివగామిగా సెకండ్ ఇన్నింగ్ లో ఆమె పోషించిన పాత్ర అయితే ఇండియన్ వైడ్ గా రమ్యకృష్ణకి ఫాలోయింగ్ పెంచింది అని చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి కేవలం తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపించే విధంగా రమ్యకృష్ణ తన నటనతో ఆకట్టుకుంది. అందుకే ఇండియన్ ఇండస్ట్రీలో 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటికి ఫేమ్ తగ్గని నటిగా రమ్యకృష్ణ తన ప్రస్థానం కొనసాగిస్తుంది. ఇండస్ట్రీలో యువరాణిగా ప్రయాణం మొదలు పెట్టి రాజమాతగా కీర్తించబడే స్థాయికి చేరుకుంది.