మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో తండ్రి, కొడుకులుగా నటిస్తున్నాడు. దీనికి సంబందించిన కొన్ని ఫోటోలు కూడా బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు అఫీషియల్ గా నిర్మాత కన్ఫర్మ్ చేశారు. ఈ నేపధ్యంలో శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. కన్నడ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నార్తన్ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.
ప్రశాంత్ నీల్ శిష్యుడు అయిన నార్తన్ ఇప్పటికే మఫ్టీ అనే సినిమాతో కన్నడంలో డెబ్యూతో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ మాస్ కంటెంట్ ని రామ్ చరణ్ కి చెప్పి ఒకే చేసుకున్నట్లు టాక్. ముందుగా ఈ సినిమాని యష్ తో చేద్దామని నార్తన్ భావించాడు. అయితే ఏ కారణాల వలనో ఆ స్క్రిప్ట్ ని యష్ తిరస్కరించడంతో రామ్ చరణ్ తో అతను ఓకే చేయించున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా మరో వార్త కూడా టాలీవుడ్ లో వినిపిస్తుంది. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా సుకుమార్ తో ఉంటుందని టాక్. రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ తో పుష్ప 2 తెరకెక్కించే పనిలో ఉన్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకి ముందు పుష్ప ప్రారంభానికి ముందే రామ్ చరణ్ తో ఒక మూవీకి సంబందించిన 10 మినిట్స్ ఎపిసోడ్ షూటింగ్ చేసినట్లు టాక్. అయితే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మీద దృష్టిపెట్టడంతో దానిని పక్కన పెట్టారని తెలుస్తుంది. పుష్ప 2 పూర్తయిన తర్వాత రామ్ చరణ్ లుక్స్ చూసుకొని ఆ సినిమాని పట్టాలు ఎక్కించే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ కూడా సుక్కుతో సినిమాకి ఓకే చెప్పినట్లు బోగట్టా. ఇక ఇటు శంకర్ తో రామ్ చరణ్, అటు అల్లు అర్జున్ తో సుకుమార్ మూవీ రిలీజ్ తర్వాత ఈ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్తుందనేది ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న మాట.