Ram Charan: రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన ఇమేజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు. రంగస్థలం సినిమాతో తన నటన గురించి చాటిచెప్పిన రామ్‌చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీతో ఆస్కార్ అవార్డు పొందే అవకాశం కూడా ఉందని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఏకంగా రామ్‌చరణ్ మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.
శంకర్ సినిమాలో హీరోకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. జెంటిల్‌మేన్, ఒకేఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో సినిమాలు చూస్తే శంకర్ సినిమాల్లో హీరోలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు రామ్‌చరణ్‌తో తీయబోయే మూవీలోనూ కథను బట్టి హీరో పాత్రకు చాలా వెయిటేజీ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. నిజానికి ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు.
అయితే అనూహ్య పరిణామాల కారణంగా రామ్‌చరణ్-శంకర్ మూవీ ఆలస్యం అవుతోంది. దీనికి కారణంగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు-2 మూవీ. ఈ సినిమా ముందే కమిట్ అయిన ప్రాజెక్ట్ కావడంతో శంకర్ ఈ సినిమాపైనే దృష్టి పెట్టాడు. గతంలో షూటింగ్‌లో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఈ మూవీ ఆగిపోయింది. కానీ కమల్ విక్రమ్ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇండియన్-2 మూవీని మళ్లీ తెరపైకి తేవడంతో శంకర్ ప్రణాళికలు దెబ్బతిన్నాయి. ఆర్సీ15ని పూర్తిగా పక్కనబెట్టకుండా శంకర్ తనకు వీలు చిక్కినప్పుడు షూటింగ్ చేస్తున్నాడు.
Ram Charan: 2023లో రామ్‌చరణ్ మూవీ రాదా?
2022లో ఆర్.ఆర్.ఆర్, ఆచార్య వంటి మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌చరణ్ నటించిన సినిమా 2023లో వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. శంకర్‌తో చేస్తున్న సినిమా 2024లోనే రిలీజ్ అవుతుందని ఇప్పుడు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఇంకా 50 శాతం షూటింగ్ పూర్తి చేయడమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు శంకర్ సమయం కేటాయించాలి. దీంతో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందని.. దీంతో 2024లోనే శంకర్, రామ్‌చరణ్ మూవీ విడుదలవుతుందని తెలుస్తోంది.