హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్ వర్త్ ఆర్ఆర్ఆర్ సినిమా స్టార్లు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పట్ల ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన నటులుగా వారిని అభివర్ణించారు. హెమ్స్ వర్త్ త్వరలోనే ‘ఎక్స్ ట్రాక్షణ్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2020లో వచ్చిన ఎక్స్ ట్రాక్షన్ కు ఇది సీక్వెల్.

ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలసి పనిచేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని పేర్కొడం గమనార్హం.‘‘ఆర్ఆర్ఆర్ సినిమాను ఇటీవలే చూశా. సినిమా అద్భుతంగా అనిపించింది. నమ్మలేకుండా ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతం. ఒకవేళ వారితో కలసి నటించే అదృష్టం లభిస్తే అది అద్భుతమే’’ అని ఓ మీడియా సంస్థతో క్రిస్ హెమ్స్ వర్త్ తెలిపారు.
ఆర్ఆర్ఆర్ సినిమాని జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పిల్ బర్గ్ సహా ఎంతో మంది హాలీవుడ్ దిగ్గజాలు ప్రశంసించడం తెలిసిందే. దేశ విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,200 కోట్ల వరకు వసూళ్లు నమోదు చేసింది.