టాలీవుడ్ లో గత ఏడాది సూపర్ హిట్ మూవీగా నిలిచి ఇండియన్ వైడ్ గా సత్తా చాటిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక రిలీజ్ అయిన అన్ని బాషలలో ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో తగ్గేదిలే అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో కూడా అందరికి తెలుసు. ఇక సాంగ్స్ అయితే మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకొని రికార్డులని తిరగారాసాయి. బాలీవుడ్ లో సైతం ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సైమా అవార్డుల వేడుకలో ఈ సినిమా సత్తా చాటింది.
ఏకంగా ఆరు కేటగిరీలలో ఈ మూవీ అవార్డులని సొంతం చేసుకోవడం విశేషం. దీని తర్వాత ఆ స్థాయిలో ఉప్పెన సినిమాకి మూడు కేటగిరీలలో అవార్డులు వచ్చాయి. సౌత్ ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా సైమా అవార్డుల కార్యక్రమం బెంగళూరులో వైభవంగా జరిగింది. ఇందులో దక్షిణాదిలోని పరిశ్రమలకు చెందిన ఎంతో మంది స్టార్లు సందడి చేశారు. సైమా 2022 అవార్డుల్లో ఎక్కువ విభాగాల్లో నామినేషన్‌లో ఉన్న పుష్ప సినిమా సత్తా చాటింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ గేయ రచయిత విభాగాల్లో పుష్ప చిత్రానికి అవార్డులు దక్కాయి.
మొత్తం ఈ సినిమా 12 విభాగాల్లో నామినేట్ అవగా ఆరు అవార్డులను దక్కించుకుంది. ఇక ఉప్పెన సినిమా ఉత్తమ డెబ్యూ డైరెక్టర్, హీరో, హీరోయిన్ కేటగిరీలలో అవార్డులని సొంతం చేసుకుంది. ఇలా తొమ్మిది విభాగాలలో మెగా హీరోలు సైమా వేడుకలలో అవార్డులని సొంతం చేసుకోవడం విశేషం. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇలా ఒకే కుటుంబానికి చెందిన హీరోలు మెజారిటీ అవార్డులని సొంతం చేసుకోవడం ద్వారా సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసారని చెప్పాలి.