పుష్ప సినిమా వాళ్లందరూ అల్లు అర్జున్ కంటే ముందు ఆయన పక్కన చేసిన కారెక్టర్ గురించి ఎక్కువగా గూగుల్ చేసారు. ఎందుకంటే సడన్‌గా ఉన్నట్లుండి అంత పెద్ద కారెక్టర్ అందుకున్నాడు ఎవరబ్బా ఆ నటుడు అంటూ అంతా తెెగ వెతికారు. సాధారణంగా హీరో పక్కన సినిమా అంతా ఉండే పాత్ర కోసం పేరున్న నటులను తీసుకుంటారు దర్శకులు. కానీ సుకుమార్ మాత్రం మరోసారి కొత్త నటుడికే అవకాశం ఇచ్చాడు. రంగస్థలంలో మహేష్‌లా పుష్పలో జగదీష్ బండారిని తీసుకున్నాడు. కొత్త నటుడు అయితే బాగుంటుందని అతడితోనే కానిచ్చేసాడు సుకుమార్. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పక్కన జబర్దస్త్ కమెడియన్ మహేష్‌కు ఎలాగైతే ఛాన్స్ ఇచ్చాడో.. అచ్చంగా అలాగే పుష్పలో కూడా బన్నీ పక్కన మరో కొత్త నటుడికి అవకాశం ఇచ్చాడు సుకుమార్. సినిమా అంతా.. ఇంకా చెప్పాలంటే రష్మిక మందన్న కంటే పెద్ద కారెక్టర్ చేసాడు కేశవ కారెక్టర్ చేసిన నటుడు. ఆయన పేరు జగదీష్ ప్రతాప్ బండారి.
ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ఇంతకు ముందు ఎన్నుడూ చూడలేదు. ఏ సినిమాలో కూడా కనిపించినట్లు ప్రేక్షకులకు కనీసం ఐడియా లేదు. పుష్ప సినిమా చూసిన తర్వాత బన్నీ తర్వాత అంతా ఎక్కువగా పొగుడుతున్న నటుడు జగదీష్. ఎవరీ నటుడు.. ఎక్కడ్నుంచి వచ్చాడబ్బా అంటూ ఆరా తీస్తున్నారు. పుష్ప కంటే ముందు జగదీష్ నటించింది కేవలం కొన్ని సినిమాల్లోనే. కరుణ కుమార్ తెరకెక్కించిన పలాస 1978 సినిమాలో నటించాడు ఈయన. అందులో జగదీష్ పాత్రకు మంచి పేరు వచ్చింది. ప్రియదర్శి హీరోగా వచ్చిన మల్లేశం సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించాడు జగదీష్. అయితే సినిమా థియేటర్స్‌లో పెద్దగా విజయం సాధించకపోవడం.. చిన్న సినిమా కావడంతో కోరుకున్న గుర్తింపు అయితే రాలేదు. అలాగే ఆహాలో వచ్చిన కొత్త పోరడులో కూడా నటించాడు జగదీష్. అదే సమయంలో సీమ యాసలో అద్భుతంగా మాట్లాడే ఈ నటుడిని సుకుమార్ పట్టుకున్నాడు. తన సినిమా కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే సాగుతుంది కాబట్టి జగదీష్‌కు పుష్పలో అంత పెద్ద పాత్ర ఇచ్చాడు. తనను నమ్మి అంతటి కారెక్టర్ ఇచ్చిన సుక్కు నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టాడు జగదీష్ బండారి. జయశంకర్ జిల్లా నుంచి వచ్చిన జగదీష్.. తెలంగాణ ప్రాంతం వాడైనా కూడా సీమ యాసను అద్భుతంగా పలికించాడు. కచ్చితంగా ఇకపై ఈయన కెరీర్ మరింత ముందుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.
హీరో పక్కనే ఉంటూ.. అప్పుడప్పుడూ బన్నీపైనే సెటైర్లు వేసాడు జగదీష్. మంచి టైమింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే పుష్పలో ఈ కారెక్టర్ రావడానికి తనెంత కష్టపడ్డాను అనేది చెప్పుకొచ్చాడు జగదీష్ ప్రతాప్ బండారి. ఈ సినిమా కంటే ముందు రెండు మూడు సినిమాలు చేసినా కూడా గుర్తింపు రాకపోవడంతో అంతా వెనక్కి వచ్చేయాలని నిరుత్సాహ పరిచినట్లు చెప్పాడు జగదీష్. అలాంటి సమయంలోనే పుష్ప ఆడిషన్స్‌కు వెళ్లాడు ఈయన. పుష్ప సినిమాకు ఆడిషన్స్ వెళ్లినపుడు ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏకధాటిగా 6 గంటల పాటు ఆడిషన్ ఇచ్చాడు జగదీష్. ఎన్నో రకాల పర్ఫార్మెన్సులతో సుకుమార్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. అన్ని చేసిన తర్వాత ఈయన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే వారం రోజుల షూటింగ్ తర్వాత హైదరాబాద్‌లోనే జగదీష్‌కు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో ఆయన చేయి విరిగింది.
అంత పెద్ద అవకాశం వచ్చిన తరుణంలో అనుకోకుండా ప్రమాదం జరగడంతో పుష్ప ఛాన్స్ మిస్ అయిపోతుందేమో అని చాలా భయపడ్డాడు జగదీష్ బండారి. కానీ అంతలోనే కరోనా మొదలు కావడంతో షూటింగ్ చాలా రోజుల పాటు ఆగిపోయింది. దాదాపు ఆర్నెళ్లకు పైగా ఖాళీగానే ఉండటంతో ఆ సమయంలో తాను మళ్లీ షూటింగ్ కోసం సిద్ధమైనట్లు చెప్పాడు జగదీష్. మొత్తానికి పుష్ప తన జీవితాన్ని మార్చేసింది అంటున్నాడు ఈయన.
ఇది ఐలా ఉంటె మహేష్ విట్టా ఈ జగదీష్ క్యారెక్టర్ పై స్పందించాడు… బన్నీ తరువాత కేశవ పాత్రలో నటించిన జగదీష్‌కే ఎక్కువ పేరు వచ్చింది. అలా ఒక్కసారిగా జగదీష్ ఇండస్ట్రీ మొత్తాన్నీ తన వైపుకు తిప్పుకున్నాడు. ఇండస్ట్రీలో నాలుగేళ్లుగా పడుతున్న కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడు కేశవ అంటే మామూలోడు కాదు. అయితే ఈ కేశవ కోసం చాలా మందినే ఆప్షన్స్‌గా పెట్టుకున్నారట. ఈ పాత్రకు మహేష్ విట్టా కూడా దాదాపుగా సెలెక్ట్ అయ్యాడట.
మహేష్ విట్టా కేశవ పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్లాడట. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం. కేశవ పాత్రకు నాతో పాటు చాలా మందిని ఆడిషన్ చేశారు. నాకు సీన్లు చెప్పారు. కారెక్టర్ అంతా వివరించారు. అంతా ఓకే అనుకున్నాం. కానీ చివరకు నన్న పిలవలేదు. ఆ అబ్బాయిని పెట్టుకున్నారు. అంటే ఒకే సినిమాకు రెండు సంవత్సరాల టైం ఇస్తానో లేదో అని వాళ్లు అనుకుని ఉంటారు.
కానీ తెరపై కేశవ పాత్రను చూసి చాలా సంతోషమనిపించింది. నాకు ఎలా చెప్పారో అలానే తీశారు. అంత మంచి పాత్రకు నన్ను కూడా అనుకున్నారనే సంతృప్తి నాకు ఉంది. ఆ పాత్ర నేను చేయలేదని బాధ అయితే అస్సలు లేదు. అలాంటి పాత్రను నేను చేయగలను అని వారు నమ్మారు. నాకు అది చాలు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా పిలుస్తారు కదా? అని మహేష్ విట్టా చెప్పుకొచ్చాడు. ఇక చిత్తూరు యాసలో బన్నీ అదరగొట్టేశాడని, అక్కడి వాళ్లు కూడా అంత స్ఫష్టంగా పలకలేరంటూ బన్నీ మీద మహేష్ ప్రశంసలు కురిపించాడు.