Protocal Issue: రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. అవసరాన్ని బట్టి మిత్రులు శత్రవులుగానూ, శత్రువులు మిత్రులుగానూ మారుతుంటారని లోక మెరిగిన సత్యం. అయితే సొంత వాళ్ల నుండి చాలాసార్లు వ్యతిరేకత అనేది రాజకీయాల్లో సాధారణమే. ఏపీలో ఓ ఎమ్మెల్యేకు ఇలాంటి సంకట స్థితి ఏర్పడింది.
పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఓ ఎమ్మెల్యే వెళ్లగా.. సొంత పార్టీకి చెందిన నేతలు, సర్పంచ్ లు, నాయకులు ఆయన టూర్ ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాన్వాయ్ ముందుకు వెళ్లడానికి వీలులేదని రోడ్డుకు అడ్డంగా కూర్చుకున్నారు. ‘ఎమ్మెల్యే గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పాపం.. సదరు ఎమ్మెల్యే తన కార్యక్రమాలను మధ్యలోనే వదిలేసి, తిరుగు ప్రయాణం అయ్యాడు.
వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం గుడివాడలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి హాజయ్యారు. అయితే ఎమ్మెల్యే కార్యక్రమానికి సంబంధించి ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని, ప్రభుత్వ కార్యక్రమాల మీద తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచులు ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకున్నారు. ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్.. ఎమ్మెల్యే గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
Protocal Issue:
ఈ నిరసన కార్యక్రమంలో గుడివాడ సర్పంచ్ శ్రీనుబాబు, వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పలరాజు, జడ్పీటీసీ సభ్యురాలు కాకరదేవి, ఇతర నాయకులు పాల్గొనగా.. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు, నేతల మధ్య తోపులాట జరగగా.. శ్రీనుబాబు గాయపడ్డారు. వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పలరాజు, జడ్పీటీసీ సభ్యురాలు కాకరదేవి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు.